crime News: కొందమాల్‌ జిల్లాలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

ఒడిశాలోని కొందమాల్‌ జిల్లా గొచ్చాపడ ఠాణా పరిధిలోని మటకుప రిజర్వ్‌ ఫారెస్ట్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్వోజీ), మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.

Published : 07 Dec 2022 19:52 IST

బరంపురం: ఒడిశాలోని కొందమాల్‌ జిల్లా గొచ్చాపడ ఠాణా పరిధిలోని మటకుప రిజర్వ్‌ ఫారెస్ట్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్వోజీ), మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. మరికొందరు గాయపడినట్లు ఐజీ(ఆపరేషన్స్‌) అమితాబ్‌ ఠాకూర్‌ విలేకరులకు చెప్పారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్‌ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారని తెలిపారు. స్పందించిన బలగాలు వారిని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించాయని, అయినా మావోయిస్టులు లొంగిపోకపోవడంతో ఇరువైపులా కాల్పులు జరిగాయన్నారు. ఇద్దరు మృతి చెందగా, కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని వెల్లడించారు. ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌తోపాటు మూడు దేశీయ తుపాకీలు, 37 రౌండ్ల తూటాలు, ఒక ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌, రూ.5800 నగదు, మూడు ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు స్వాధీనం చేసున్నామని వివరించారు. మృతుల్లో ఒకరిని ఏసీఎం ర్యాంక్‌ కమలగా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతులు, తప్పించుకున్న మావోయిస్టులు కొందమాల్‌-కలహండి-బౌత్‌-నయాగడ్(కేకేబీఎన్‌) డివిజన్‌కు చెందిన వారని వెల్లడించారు. బుధవారం కొందమాల్‌ జిల్లా కేంద్రం తుల్బానీలోని రిజర్వ్‌ పోలీస్‌ మైదానంలో రాష్ట్ర పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు పరిస్థితిపై సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని