
AP News: విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు
ఆరుగురు మావోయిస్టులు హతం
పెద్దపల్లి జిల్లాకు చెందిన డీసీఎం కమాండర్ మృతి
కొయ్యూరు: విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారన్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు స్పష్టం చేశారు.
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చనిపోయిన, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సమయం పడుతుందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. అదనపు బలగాలను తరలించామన్నారు. ఘటనాస్థలిలో ఏకే- 47, తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఎన్కౌంటర్లో డీసీఎం కమాండర్ సందె గంగయ్య మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతడి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం అని చెప్పారు. సందె గంగయ్య.. ఒకప్పటి పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ సోషల్ కమిటీ కార్యదర్శి సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ సోదరునిగా భావిస్తున్నారు. రాజమౌళి గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అతని పెద్దనాన్న కుమారుడే గంగయ్య అని.. ఇతడి సోదరుడు కూడా పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం.
ఇవీ చదవండి
Advertisement