Smoking Beedi: విమానంలో ‘బీడీ’ కాలుస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు.. ప్రశ్నిస్తే.. అవాక్కయ్యే సమాధానం..!

విమాన ప్రయాణ సమయంలో ఓ ప్రయాణికుడు బీడీ కాల్చిన (Smoking Beedi) ఘటన అహ్మదాబాద్‌-బెంగళూరు విమానంలో చోటుచేసుకుంది.

Published : 18 May 2023 01:37 IST

బెంగళూరు: విమానంలో బీడీ కాలుస్తూ (Smoking) ఓ ప్రయాణికుడు పట్టుబడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అతడిని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kempegowda Airport) పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తొలిసారి తాను విమానంలో ప్రయాణించానని.. ఇక్కడ నిబంధనల గురించి తనకు తెలియదని చెప్పాడు. గతంలో రైలు ప్రయాణాల్లో ఎన్నోసార్లు టాయిలెట్లలో ధూమపానం చేశానని.. అదేవిధంగా విమానంలో ప్రయాణించినట్లు వెల్లడించడం గమనార్హం.

రాజస్థాన్‌లోని మార్వాడ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (56) తొలిసారి విమాన ప్రయాణం చేశాడు. అహ్మదాబాద్‌ నుంచి విమానంలో బెంగళూరు బయలుదేరాడు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన.. బీడీ కాల్చడం (Smoking Beedi) మొదలుపెట్టాడు. స్మోక్‌ అలర్ట్‌ రావడంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది.. బాత్‌రూమ్‌ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. బయటకు వచ్చిన తర్వాత అతడిని ప్రశ్నించగా.. నిబంధనల గురించి తనకు తెలియదని చెప్పాడు. చివరకు బెంగళూరుకు చేరుకున్న అనంతరం సదరు ప్రయాణికుడిని విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడంతోపాటు ఇతర సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని విచారించారు. తనకు నిబంధనల గురించి తెలియదని చెప్పాడు. గతంలో ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసినప్పుడు టాయిలెట్లలో ధూమపానం చేశానని.. ఇప్పడు విమానంలో కూడా అలాగే ప్రయత్నించానని బదులివ్వడం కొసమెరుపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు