శివకాశిలో పేలుడు: ఆరుగురి మృతి

తమిళనాడులో శివకాశిలో ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి

Updated : 26 Feb 2021 05:33 IST

చెన్నై: తమిళనాడులో శివకాశి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలోని ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కేంద్రంలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అక్కడ భారీ స్థాయిలో పేలుడు సంభంవించి తయారీ కేంద్రంలోని పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

రెండు వారాల్లో మూడోసారి

శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో పేలుడు ఘటనలు జరగడం ఇది మూడోసారి. ఈనెల 12న అచ్చంకుళంలోని ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ఈ మధ్యాహ్నమే ఆదేశించడం గమనార్హం.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని