Wall Collapsed: కూలిన కుటుంబం

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఆరు నెలలు వలసపోయి ఇటుకబట్టీల వద్ద పనిచేస్తూ.. ఆరు నెలలు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ.. అయిదుగురు (నలుగురు

Updated : 11 Oct 2021 04:43 IST

గోడ పడి ఇంట్లో నిద్రిస్తున్న అయిదుగురి దుర్మరణం

మృతుల్లో తల్లిదండ్రులు, ముగ్గురు చిన్నారులు

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం

అయిజ, న్యూస్‌టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఆరు నెలలు వలసపోయి ఇటుకబట్టీల వద్ద పనిచేస్తూ.. ఆరు నెలలు గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ.. అయిదుగురు (నలుగురు కుమారులు, ఒక కుమార్తె) సంతానాన్ని సాకుతూ ఆనందంగా గడుపుతున్న దంపతులు వారు. ఆదివారం పంట కోతల పండగ జరుపుకోవాలని శనివారం రాత్రి సంతోషంగా పిల్లలతో కలిసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గతంలో పునాది లేకుండా ఇంట్లో కట్టిన గోడ కూలి వారిపై పడడంతో.. తల్లిదండ్రులు, ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మోష(35), శాంతమ్మ(30) వారి కుమారులు చరణ్‌(10), తేజ(8), రామ్‌(6) దుర్మరణం పాలయ్యారు. అయిదేళ్ల స్నేహ, నాలుగేళ్ల చిన్నా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెల్లవారుజామునే నిద్రలేచి పనులు చేసుకునే ఈ కుటుంబం ఆదివారం ఉదయం 6.30 గంటలైనా బయటికి రాకపోవడంతో ఎదురింటి మహిళ వెళ్లి తడికెల తలుపును తట్టింది. చిన్నారి ఏడుపు వినిపించడంతో తలుపు తెరిచి చూసేసరికి గోడ కూలి కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవగా అంతావచ్చి పరిశీలించారు. అప్పటికే అయిదుగురు మృతి చెంది ఉన్నారు. గాయపడిన చిన్నా, స్నేహలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కూలిన గోడ శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తెచ్చారు.

గుడిసె లోపల ఇటుకలతో 14 అంగుళాలతో నిర్మించుకున్న గోడకు పునాది లేదు. మరోవైపు ఎలుకలు తోడడంతో కింద కంతలు పడ్డాయి. శనివారం రాత్రి భారీ ఉరుములతో వర్షం కురిసింది. ఆ సమయంలో పునాదిలేని గోడ కూలి వారిపై పడి ఉంటుందని గ్రామస్థులు, పోలీసులు తెలిపారు. గుడిసెలో ఒక మంచంపై తల్లి, తండ్రి ఇద్దరు పిల్లలు, మరో మంచంపై ముగ్గురు పిల్లలు గోడవైపు తలపెట్టి పడుకున్నారు. చివరన పడుకున్న స్నేహ, చిన్నాలపై తొలుత గోడపై ఉన్న బట్టల మూట పడి, తర్వాత శిథిలాలు కొద్దిగా పడడంతో వారు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.  గాయపడిన చిన్నారులిద్దరినీ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. దసరాకు ముందు ఆదివారం నిర్వహించుకునే పంట కోతల పండగను ఎవరూ జరుపుకోలేదు. మోష తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా.. శాంతమ్మకు తల్లి ఒక్కరే ఉన్నారు. ఆమె వేరే గ్రామంలో ఉంటున్నారు.

రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా 

ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను గుర్తించాలని, ఆయా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మొత్తం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల్ని ఆదుకుంటామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని