ఫారెస్ట్‌ రేంజ్ మహిళా అధికారి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి ఓ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబ్‌నగర్‌........

Published : 13 Aug 2020 02:19 IST

గండీడ్‌: కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి ఓ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్ ఠాణా పరిధిలోని ఫారెస్టు కార్యాలయంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... ఖిల్లా ఘనపూర్‌కు చెందిన వహీదాబేగం (32) మహ్మదాబాద్ రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త భానుప్రకాశ్ జిల్లా ఫారెస్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు వహీదాబేగం, కొల్లాపూర్‌కు చెందిన భానుప్రకాష్‌ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నిరోజుల తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె (3) ఉంది. 

భానుప్రకాశ్‌కు డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వహీదాబేగం బుధవారం ఫారెస్టు కార్యాలయంలో క్రిమి సంహారక మందు తాగింది. గుర్తించిన తోటి ఉద్యోగులు వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వహీదాబేగం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగారాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని