Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో గోల్డ్‌ షాప్‌లో లూటీ.. నలుగురు నిందితులు అరెస్టు

ఐటీ అధికారుల ముసుగులో బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు.

Updated : 29 May 2023 17:05 IST

రెజిమెంటల్‌ బజార్‌: సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని బంగారం దుకాణంలో ఐటీ అధికారుల ముసుగులో చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జాకీర్‌, రహీమ్‌, ప్రవీణ్‌, అక్షయ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. చోరీ చేసిన తర్వాత నిందితులు మహారాష్ట్రకు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు.

పాట్‌ మార్కెట్‌లోని నవకార్‌ కాంప్లెక్స్‌ నాలుగో అంతస్తులో బాలాజీ గోల్డ్‌షాప్‌లో శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో  ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆ దుకాణంలోకి ప్రవేశించారు. తాము ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులమంటూ ఐడీ కార్డులు చూపి.. బంగారు దుకాణంలో అవకతవకలు జరిగాయంటూ హడావుడి చేశారు. పనివాళ్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని, గదిలో బంధించి.. 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీ సంచలనం రేకెత్తించింది. నకిలీ వేషాలతో వచ్చిన ఆగంతుకులు మహారాష్ట్రకు చెందిన కేటుగాళ్లు కావచ్చని పోలీసులు భావించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగుర్ని అరెస్టు చేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని