
Crime news : చిలకలగూడలో హత్యాయత్నం.. నలుగురి అరెస్టు!
హైదరాబాద్ : సికింద్రాబాద్ బేగంపేట పోలీస్టేషన్ పరిధిలో చిలకలగూడలో నిన్న రాత్రి కత్తిపోట్లకు సంబంధించిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదీప్ అనే వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను అదనపు సీపీ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన నవాజ్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. చిన్న వివాదంలోనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారన్నారు. ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్, అతని స్నేహితులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రసూల్‌పురా ఇలాహీ మసీదు వద్ద ప్రదీప్ నడుచుకుంటూ వెళ్తుండగా.. మునీర్ అతని స్నేహితులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఇంటికి వెళ్తున్న ప్రదీప్‌ని డబ్బులు ఇవ్వమని మునీర్, అతని స్నేహితులు అడిగారని, ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చౌహాన్ వివరించారు. డబ్బులు ఇచ్చేందుకు ప్రదీప్ నిరాకరించడంతో పొత్తికడుపులో కత్తితో పొడిచారన్నారు. ప్రదీప్, మునీర్ గతంలో పరిచయస్తులేనని వివరించారు.