Tragedy: ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి 9మంది మృతి..

ఈ నెల 20న ఓ గదిలో ఎల్‌పీజీ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో పాటు మొత్తం 10 మంది తీవ్ర గాయాలపాలవ్వగా ......

Published : 25 Jul 2021 01:25 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ శివారులో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ చిన్న గదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు పిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌ శివారులో  ఈ నెల 20న ఓ గదిలో ఎల్‌పీజీ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో పాటు మొత్తం 10 మంది తీవ్ర గాయాలపాలవ్వగా అందరినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం రోజున ముగ్గురు మృతిచెందగా.. శుక్రవారం ఐదుగురు, శనివారం ఉదయం ఒకరు చొప్పున ప్రాణాలు విడిచారు. వీరందరూ మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించినట్టు అస్లాలి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పీఆర్‌ జడేజా వెల్లడించారు. ప్రస్తుతం ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడని, అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు పేర్కొన్నారు.

అంతా నిద్రపోతున్న సమయంలో...

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం కూలి పనులు చేసుకొనేందుకు అహ్మదాబాద్‌కు వలస వచ్చి చిన్న గదిలో నివసిస్తోంది. ఈ నెల 20న రాత్రి గదిలో అందరూ నిద్రపోతున్న సమయంలో గదిలో ఎల్‌పీజీ సిలిండర్‌ లీక్‌ అవ్వడంతో పొరుగున నివసించే ఓ వ్యక్తి వచ్చి అప్రమత్తం చేశాడు. దీంతో ఓ వ్యక్తి లేచి ఇంట్లో లైట్‌ వెలిగించగా గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు వచ్చి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గదిలో ఉన్న తొమ్మిది మందితో పాటు వారిని అప్రమత్తం చేసేందుకు వచ్చిన వ్యక్తి కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం అందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం చికిత్సపొందుతున్న వ్యక్తిని ఓ కుల్‌సిన్హ్‌ భైరవ (30)గా గుర్తించారు. అతడి పరిస్థితి కూడా ఆందోళనకంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను మధ్యప్రదేశ్‌లోని వారి స్వగ్రామానికి తరలిస్తున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని