Crime News: పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం

రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు.

Updated : 07 Jul 2024 08:11 IST

చిత్తూరు-కర్నూలు ఎన్‌హెచ్‌పై ఘోర ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో ఘటన

ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఉన్నతాధికారులు 

రాయచోటి, రామాపురం, న్యూస్‌టుడే: రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. తిరిగి వస్తూ ముందు వెళ్తున్న వాహనాన్ని వేగంగా ఢీ కొట్టారు. ఆ ధాటికి కారులోని నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన పూజారి ఆంజనేయులు నాయక్, పఠాన్‌ అఫ్రోజ్‌ అలీఖాన్, ఎం.జితేంద్రకుమార్, షేక్‌ అలీం, షేక్‌ ఖాదర్‌బాషా(19) స్నేహితులు. వీరంతా శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు రామాపురం మండలంలోని గువ్వలచెరువులో పాలకోవా తినేందుకు కడప నుంచి కారులో వెళ్లారు. పాలకోవా తిని శనివారం తెల్లవారుజామున రామాపురం వెళ్లి జాతీయరహదారి మీదుగా కడపకు బయలుదేరారు. కారు కొండవాండ్లపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్యాంకరును వేగంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆంజనేయులు నాయక్‌(28), పఠాన్‌ అఫ్రోజ్‌ అలీఖాన్‌ (26), జితేంద్రకుమార్‌(24), షేక్‌ అలీం(35) అక్కడికక్కడే మరణించారు. ఖాదర్‌బాషా తీవ్రంగా గాయపడగా పోలీసులు వచ్చి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్కిరెడ్డిపల్లె సీఐ జీవన గంగనాథబాబు తెలిపారు. ప్రమాదస్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద మంత్రి సొంత నిధులు రూ.లక్ష అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని