
ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి
విశాఖలో విషాదం చోటు చేసుకుంది ఒకే ఇంట్లో నలుగురు సజీవదహనమయ్యారు. ఈ దారుణం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా కక్షతో చేశారా? అనేది తేలాల్సి ఉంది. విశాఖ మధురవాడ మిథిలాపురికాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నం: ఓ ఎన్ఆర్ఐతో సహా అతని కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మధురవాడలోని ఆదిత్య ఫార్చ్యూన్ టవర్‌లో ఫ్లాట్ నెం.505లో అర్ధరాత్రి దాటాక భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ, మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్ల వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయింది. ఫ్లాట్‌లో ఉన్న నలుగురూ సజీవ దహనమయ్యారు. మృతులు బంగారు నాయుడు (50), అతని భార్య నిర్మల (46), కుమారులు దీపక్ (22), కశ్యప్ (19)గా గుర్తించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్నాయి. వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడ వాసులు. బహ్రెయిన్‌లో స్థిరపడిన బంగారు నాయుడు నాలుగేళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చ్చూన్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు. ఆ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీపక్ మినహా ముగ్గురి ఒంటిపై గాయాలు: సీపీ
ఘటనాస్థలిని విశాఖ సీపీ మనీశ్ కుమార్ సిన్హా పరిశీలించారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెల్లవారు జామున 4గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బంగారు నాయుడు విదేశాల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఆయన భార్య డాక్టర్ నిర్మల హోమియో వైద్యురాలు. పెద్ద కుమారుడు దీపక్ ఎన్ఐటీలో డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న కుమారుడు కశ్యప్ ఇంటర్ చదువుతున్నాడు. రాత్రి ఇంట్లో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాగ్వాదం అనంతరం ఇంట్లోంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. తలుపులు బద్దలుగొట్టి వెళ్లేసరికి నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. పెద్ద కుమారుడు మినహా మిగిలిన ముగ్గురి ఒంటిపై గాయాలున్నాయి. ఘటనాస్థలిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని సీపీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.