Students Suicides: చదువులా.. చావులా?.. గత 20 రోజుల్లో నలుగురి బలవన్మరణం

సీనియర్ల వేధింపులు.. అందరిలో అవమానించడం.. వార్డెన్లు, అధ్యాపకులు భౌతికంగా, మానసికంగా హింసించడం.. ఇలా పలు కారణాలతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.

Updated : 02 Mar 2023 07:31 IST

ఈనాడు - హైదరాబాద్‌

సీనియర్ల వేధింపులు.. అందరిలో అవమానించడం.. వార్డెన్లు, అధ్యాపకులు భౌతికంగా, మానసికంగా హింసించడం.. ఇలా పలు కారణాలతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. గత 20 రోజుల్లోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వ్యవస్థలో లోపాలకు నిదర్శనం. ఏవైనా సంఘటనలు జరగగానే కమిటీని నియమించడం.. ఆ తర్వాత మరిచిపోవడం షరా మామూలైంది. కానీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ప్రైవేటు కళాశాలల్లో దారుణాలు

జైళ్లలా మారిన కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ ర్యాంకుల కోసం ఒత్తిడి చేయడంతోపాటు కనీస సౌకర్యాలు కరవైనా అడిగే నాథుడే లేడు. చదువులో వెనకబడిన విద్యార్థులకు అధ్యాపకులు, వార్డెన్ల సూటిపోటి మాటలు, అందరి ముందు తిట్టడం.. ఇలా నిత్య వేధింపులు తప్పవు. నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో మంగళవారం రాత్రి సాత్విక్‌ ఆత్మహత్యకు కూడా అవే ప్రధాన కారణాలని అతడు రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతోంది. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించిన ఆ విద్యార్థి ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు తమ ప్రాంగణాలను ఓఆర్‌ఆర్‌ అవతలికి తరలించడంతో వ్యయప్రయాసల కారణంగా తల్లిదండ్రుల రాక తగ్గింది. మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో.. ఇటీవల కాపీ కొట్టినట్లు వార్డెన్‌కు తెలుస్తుందని భయపడి మొదటి సంవత్సరం విద్యార్థి ఆరు జ్వరం మాత్రలు వేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

రారా.. పోరా.. ఇవే పిలుపులు

‘నేను రెండేళ్లపాటు చదివినా నా పేరు కాదు.. తరగతిలో టాప్‌ ర్యాంకులో ఉండే వాళ్లవి ఇద్దరు ముగ్గురు విద్యార్థులవి తప్ప మిగిలిన పిల్లల పేర్లు అధ్యాపకులకు, వార్డెన్లకు తెలియదు. రారా, పోరా, అరె.. అనే పిలుస్తారు’ అని నాలుగేళ్ల కిందట ఇంటర్‌ పూర్తయిన బీటెక్‌ విద్యార్థి ఒకరు ‘ఈనాడు’తో అభిప్రాయపడ్డారు. ‘హాస్టళ్లలో ఉండే విద్యార్థులపై యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు- విద్యార్థులు, కళాశాల ప్రతినిధుల మధ్య సమావేశాలు జరగడంలేదు. ఫోన్‌ నంబర్లు కూడా ఇవ్వడం లేదు’ అని ఐఐటీ జేఈఈ నీట్‌ ఫోరమ్‌ డైరెక్టర్‌ లలిత్‌కుమార్‌ పేర్కొన్నారు.


ఇవీ ఇటీవలి ఘోరాలు...

* వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల: పీజీ విద్యార్థిని ప్రీతి బలవన్మరణం. సీనియర్‌ వేధింపులే కారణమని విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆరోపణ.

* నర్సంపేట ఇంజినీరింగ్‌ కళాశాల: వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని మిత్రుడు వేధించడంతో బీటెక్‌ మూడో ఏడాది విద్యార్థిని ఆత్మహత్య.

* హైదరాబాద్‌ పీర్జాదిగూడలోని శ్రీచైతన్య కళాశాల: ఇంటర్‌ బైపీసీ చదువుతున్న రమాదేవి అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య.

* హైదరాబాద్‌ శివారులోని శ్రీచైతన్య కళాశాల: వార్డెన్‌, అధ్యాపకులు వేధిస్తున్నారని ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య.

* ఇంకొద్ది నెలలు వెనక్కి వెళితే.. గత సెప్టెంబరులో ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని