USA: అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్‌

USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 09 Jul 2024 11:38 IST

వాషింగ్టన్‌: అమెరికాలో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.

ప్రిన్స్‌టన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్‌బర్గ్‌ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్‌టన్‌ పోలీసు సీఐడీ విభాగం సంతోష్‌ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్‌టన్‌, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్‌, ద్వారకతో పాటు చందన్‌ దాసిరెడ్డి, అనిల్‌ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

గిన్స్‌బర్గ్‌ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్‌మెంట్‌లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని