
Tamil nadu: తమిళనాట బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: నలుగురు మృతి
కొత్త సంవత్సరంలో రెండోసారి ప్రమాదం
విరుదునగర్: కొత్త సంవత్సరం మొదలైన ఐదు రోజుల్లోనే తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూర్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో రెండోసారి పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాత్తూర్ సమీపంలోని ఏళాయిరం పణ్నై మంజల్‌వోడై పట్టి ప్రాంతంలో కరుప్పస్వామి అనే వ్యక్తికి చెందిన బాణాసంచా కర్మాగారం నడుస్తోంది.ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో 10మందికి పైగా కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా పేలుడు చోటుచేసుకుంది. ఘటనలో బాణసంచా ఫ్యాక్టరీ యజమాని కరుప్పస్వామి సహా నలుగురు మృతిచెందారు.పేలుడు దాటికి ఓ గది పూర్తిగా నేల మట్టమైంది. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పిన అగ్గిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఏళాయిరం పణ్నై పోలీసులు తెలిపారు. బాణాసంచా రసాయనాలు కలుపుతుండగా రాపిడి కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.ఈనెల 1న సాత్తూర్ సమీపంలోని కళత్తూర్ గ్రామంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 7గురు గాయపడిన విషయం తెలిసిందే.