Crime News: ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు ఇప్పిస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 10 Jul 2024 03:19 IST

 రూ.4.08 కోట్లు వసూలు 

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ బి.రోహిత్‌రాజు, చిత్రంలో నిందితురాలు, రికవరీ చేసిన సొమ్ము

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు ఇప్పిస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దాసు హరికిషన్, భార్య హారికను మంగళవారం అరెస్టు చేసి, పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. కొత్తగూడెంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్‌లో స్థిరపడ్డ వరంగల్‌ జిల్లాకు చెందిన దాసు హరికిషన్‌ ఆధ్వర్యంలో మొత్తం 13 మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొత్తగూడెం కేంద్రంగా చేసుకుని సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్, క్లర్క్, డిపెండెంట్ కొలువులు, గ్రూప్‌-2 ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇప్పిస్తామంటూ 2018 సంవత్సరం నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాటలు నమ్మి కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, శ్రీరాంపుర్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది మోసపోయారు. వారి నుంచి ఏకంగా రూ.4.08 కోట్ల వసూళ్లకు పాల్పడ్డారు. దీనిపై భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఆయా పోలీసుస్టేషన్లలో 32 మంది బాధితుల ఫిర్యాదుమేరకు కేసులు పెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్టుచేశారు. ప్రధాన నిందితుడు హరికిషన్‌ను గతంలోనే అరెస్టుచేశారు. మిగిలిన నిందితులైన గుండా వినోద్‌కుమార్, దాసు హర్ష, భీమవరపు శ్రీనివాస్, బొల్లపల్లి శ్రీనివాసాచారి, బోగాది నాగరాజు, చామర్తి సంజయ్, చామర్తి రమ్య, గుండా రవివర్మను అదుపులోకి తీసుకుని రిమాండ్‌ విధించారు. రూహత్‌ బేగ్, ఉపేంద్రనాయుడు, రవిరాజ్‌ పరారీలో ఉన్నారు. హరికిషన్‌ భార్య హారిక నుంచి రూ.1,47,14,000 నగదు, 4 తులాల బంగారం, ఓ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. నిరుద్యోగులను మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన 92.50 తులాల బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు. వాటిని సత్వరం రికవరీ చేసేందుకు యత్నిస్తామన్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రెహ్మాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని