Crime News: కొంప ముంచిన కొబ్బరిబొండాల్లో మద్యం... యూట్యూబర్‌ మృతికి కారణాలివేనా?

గచ్చిబౌలిలో కారు ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న హోలీ పండుగ రోజు జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే,

Updated : 19 Mar 2022 16:36 IST

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో కారు ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న హోలీ పండుగ రోజు జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే, ప్రమాదానికి అసలు కారణం తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ ప్రధాన గేటు వద్ద శుక్రవారం సాయంత్రం అతివేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకుంది. విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో నియంత్రణ కోల్పోయి రహదారి పక్కన చెట్లకు నీరు పోస్తున్న హోటల్‌ కార్మికురాలు నాయకుని మహేశ్వరి(38)ని ఢీకొట్టుకుంటూ వెళ్లి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. అద్దాలు పగిలి కారులో ప్రయాణిస్తున్న యూట్యూబర్‌ ఎస్‌. గాయత్రి (27) రోడ్డుపై పడిపోయింది. యువకుడు కారు సీట్ల మధ్య ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో మహేశ్వరి అక్కడికక్కడే మరణించగా కారు నడుపుతున్న డి.రోహిత్‌(26), పక్కనే కూర్చున్న గాయత్రి  తీవ్రగాయాల పాలయ్యారు. ఇద్దరినీ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా గాయత్రి మృతి చెందింది. యువకుడు అపస్మారక స్థితిలో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కొబ్బరి బొండాల్లో మద్యం కలుపుకొని...

అయితే.. ప్రమాదానికి గురైన రోహిత్‌.. స్నేహితులు కలిసి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. హోలీకి ముందురోజే వీరు మద్యం కొనిపెట్టుకున్నారు. స్నేహితుడి గదిలో  రోహిత్‌, గాయత్రి, మరో ఐదుగురు పార్టీ చేసుకున్నారు. అనంతరం కొబ్బరిబొండాల్లో మద్యం నింపుకొన్నారు. కారులో కొబ్బరిబొండాలతో ప్రిజబ్‌ పబ్‌కు వెళ్లారు. వేడుకల నుంచి వచ్చి కొబ్బరిబొండాల్లోని మద్యం తాగారు. అలా ఆరు కొబ్బరిబొండాల్లోని మద్యాన్ని తాగారు. కారులోనే ఉండిపోయిన మరో 2 కొబ్బరి బొండాలను పోలీసులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం పంపారు.

మహేశ్వరి బంధువుల ఆందోళన..

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహేశ్వరి బంధువులు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. హోటల్‌కి వాహనాల రాకపోకలను నిలిపివేసి నినాదాలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని