‘నిర్భయ’ దోషులకు డెత్‌ వారెంట్‌

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది

Updated : 08 Jan 2020 01:58 IST

దిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. దోషులను జనవరి 22(బుధవారం)న ఉదయం 7 గంటలకు తిహాడ్‌ జైల్లో ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని సూచించింది. 

నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. దోషులకు సంబంధించి ఏ కోర్టులోనూ, రాష్ట్రపతి ముందు గానీ ఎలాంటి పిటిషన్లు పెండింగ్‌లో లేవని.. అంతేగాక దోషుల రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టిపారేసిందని నిర్భయ తల్లిదండ్రుల తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. కాబట్టి తక్షణమే డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని అభ్యర్థించారు. అయితే తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయని దోషుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్ల ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 

నిర్భయకు న్యాయం జరిగింది..

కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమ కుమార్తెకు న్యాయం జరిగిందని అన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌, పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మనీశా గులాటీ కూడా తీర్పును స్వాగతించారు. మరోవైపు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు దోషుల తరఫు న్యాయవాది తెలిపారు. 

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని