తమిళనాడులో ఎస్సై దారుణ హత్య

దుండగులు చేసిన కాల్పుల్లో ఓ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉన్న కన్యాకుమారి జిల్లాలోని కాళియక్కావిళిలో ఈ ఘటనచోటు చేసుకుంది.

Published : 09 Jan 2020 21:50 IST

చెన్నై: దుండగులు చేసిన కాల్పుల్లో ఓ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉన్న కన్యాకుమారి జిల్లాలోని కాళియక్కావళిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విల్సన్‌(56) మరో
ఐదు నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. గురువారం విధుల్లో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లపాటు అతని ఛాతిపై కాల్చడంతో విల్సన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ కాల్పుల చప్పుళ్లు విన్న స్థానికులు ఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి ఎస్సై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే కాళియక్కావళి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి గాయపడ్డ విల్సన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. పోస్టు మార్టం నిమిత్తం ఆసరిపల్లంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు పళనిస్వామి కారకులను వీలైనంత త్వరగా పట్టుకొని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తమిళనాడు డీజీపీ జలాద్‌ త్రిపాఠి, కేరళ డీజీపీ లోకనాథ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కన్యాకుమారి కలెక్టర్‌ ప్రశాంత్‌, ఎస్పీ శ్రీనాథ్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాల్పులకు పాల్పడ్డ వారిని కనిపెట్టేందుకు పోలీసులు అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల జాడను తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ఇంటింటి తనికీలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని