కాల్‌సెంటర్‌ ఉద్యోగికి రూ.3.5కోట్ల జరిమానా!

మధ్యప్రదేశ్‌లోని బిండ్‌ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కాల్‌ సెంటర్‌లో పనిచేసే ఓ వ్యక్తికి ఆదాయ పన్నుల శాఖ నుంచి రూ.3.49కోట్ల పెనాల్టీ నోటీసు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరి 17లోపు ఆ నగదు చెల్లించాలని నోటీసులో పేర్కొనడంతో బాధితుడు అవాక్కయ్యాడు.

Published : 17 Jan 2020 00:28 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కాల్‌ సెంటర్‌లో పనిచేసే ఓ వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ నుంచి రూ.3.49కోట్ల పన్ను జరిమానా నోటీసు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరి 17లోపు ఆ నగదు చెల్లించాలని నోటీసులో పేర్కొనడంతో బాధితుడు అవాక్కయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లాకు చెందిన రవి గుప్తా అనే వ్యక్తి పంజాబ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు ఓ బీపీవో సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడికి ఆదాయ పన్ను శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. అందులో 2011-12 సంవత్సరంలో తన పాన్‌ నంబర్‌ మీద రూ.132 కోట్ల లావాదేవీలు జరిపినట్లు.. అందుకు గానూ రూ.3.49కోట్ల పెనాల్టీ చెల్లించాలని తెలిపింది. దీంతో షాక్‌కు గురైన బాధితుడు ఐటీ అధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లాడు. 

ఆ లావాదేవీల గురించి తనకేమీ తెలియదని.. ఎవరో తన పాన్‌ నంబర్‌ సాయంతో నకిలీ ఖాతా తెరిచినట్లు చెప్పాడు. కానీ ఫలితం లేకపోవడంతో తానే నేరుగా విచారణ చేసి నిజం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ముంబయిలో స్థాపించిన ఓ సూరత్‌ బేస్‌ వజ్రాల కంపెనీ తన పాన్‌ నంబర్‌పై నకిలీ ఖాతా ద్వారా లావాదేవీలు జరిపినట్లు గుర్తించానని ఆరోపించాడు. కొన్ని లావాదేవీల తర్వాత ఆ ఖాతాను తొలగించినట్లు తెలిసిందని చెప్పాడు. నిందితులు ఎవరో తనకు తెలియదని.. కానీ ఇప్పుడు తాను పెనాల్టీ చెల్లించకపోతే ఐటీ శాఖ వారు రుణం ద్వారా కొన్న తన ఇంటిని జప్తు చేస్తామని నోటీసులో పేర్కొన్నారని బాధితుడు వాపోయారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని