కావాల్సినోడే కాలయముడై..!

ఆర్థిక కారణాలు, మనస్పర్థలు ఆ కుటుంబం పాలిట మృత్యుపాశాలయ్యాయి. పొద్దుపొడవకుండానే ముగ్గురి జీవితాలు తెల్లారిపోయాయి. వ్యక్తిగత కక్షతో ఓ బంధువు రాక్షస చర్యకు 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో

Published : 23 Jan 2020 07:18 IST

నిద్రిస్తున్న మేనత్త కుటుంబంపై  పెట్రోలు పోసి నిప్పుబెట్టిన వైనం
ముగ్గురి మృతి, మరొకరి పరిస్థితి విషయం
ఆర్థిక కారణాలు, మనస్పర్థలతోనే ఘాతుకం
కడియం - న్యూస్‌టుడే

ఆర్థిక కారణాలు, మనస్పర్థలు ఆ కుటుంబం పాలిట మృత్యుపాశాలయ్యాయి. పొద్దుపొడవకుండానే ముగ్గురి జీవితాలు తెల్లారిపోయాయి. వ్యక్తిగత కక్షతో ఓ బంధువు రాక్షస చర్యకు 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో గాఢనిద్రలో ఉన్న ఓ కుటుంబంపై.. ఆత్మీయుడిగా మెలగాల్సిన వ్యక్తి పెట్రోలు పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి, ఓ యువకుడు సజీవ దహనం కాగా, ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం నుంచి దుళ్ల గ్రామానికి కోట్ని సత్యవతి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం కూలీ పనుల కోసం వలస వచ్చింది. ఆమె భర్త అప్పారావు స్థానికంగా ఓ మెకానిక్‌ షెడ్‌లో కాపలాదారుగా పనిచేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు కోట్ని రాము (18)ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు దుర్గాభవాని, రామలక్ష్మికి వివాహాలయ్యాయి. ఇదిలా ఉండగా.. మాసాడ శ్రీను(సత్యవతి భర్త చెల్లెలి కొడుకు) చిత్తూరు జిల్లా తిరుపతిలో కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక కారణాలు, మనస్పర్థలతో సత్యవతి కుటుంబంపై కక్ష పెంచుకున్న శ్రీను బుధవారం తెల్లవారుజామున 2.45 గంటలకు దుళ్లలోని సత్యవతి ఇంటికి పెట్రోలు సీసాతో వచ్చాడు. తలుపులు తెరిచే ఉండటంతో లోపలికి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్నవారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టి, తలుపులకు గడియవేసి పరారయ్యాడు. వారు తేరుకునేలోపే సత్యవతి, ఆమె కుమారుడు రాము, పెద్ద కుమార్తె గంటా దుర్గాభవానితోపాటు మనవలు దుర్గామహేశ్‌, ఏసుకుమార్‌, మనవరాలు విజయలక్ష్మి(5)లను మంటలు చుట్టుముట్టాయి. ఇరుగుపొరుగువారు వచ్చి తలుపులు తీసే లోపే ఘోరం జరిగిపోయింది. కళ్ల ముందే అగ్నికి ఆహుతవుతూ ప్రాణాల కోసం పెనుగులాడుతున్న వారిని చూసి స్థానికులు తల్లడిల్లారు. ఈ ఘటనలో విజయలక్ష్మి, రాము సజీవదహనం కాగా, మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవతి బుధవారం సాయంత్రం మృతిచెందారు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో దుర్గా భవానీ పరిస్థితి విషమంగా ఉంది. అర్బన్‌ ఎస్పీ షిమోషిబాజ్‌పాయ్‌, ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీధర్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రూ.10 వేల కోసం గొడవ..

ఈనెల 17న నిందితుడు మాసాడ శ్రీను దుళ్ల గ్రామానికి వచ్చి గతంలో తన దగ్గర అప్పుగా తీసుకున్న రూ.10,000 ఇవ్వమని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మేనత్త సత్యవతిపై దాడిచేసి గాయపర్చాడు. దీనిపై కడియం పోలీసులకు సత్యవతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా..గతంలో కుమార్తె రామలక్ష్మిని శ్రీనుకిచ్చి పెళ్లిచేయాలనుకున్నా, అతడి ప్రవర్తన నచ్చక వేరే సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేశారు. డబ్బు లావాదేవీలతో పాటు పెళ్లి చేయకపోవడాన్ని మనసులో పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని