బలవంతపు వసూళ్లు

‘మీ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం రూ.15వేలు సాయం చేస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత, వాటి నిర్వహణ  సమస్యలు తలెత్తకుండా అవి మన సొంతింట్లోలా ఉండాలంటే మీకిచ్చే సాయంలో నుంచి ఓ వెయ్యి వాటి అభివృద్ధికి

Updated : 27 Jan 2020 08:52 IST

సీఎం సందేశానికి వక్రభాష్యం
రూ.వెయ్యి చొప్పున పిల్లల నుంచి గుంజుడు
అదే పనిగా పాఠశాలల్లో కమిటీల తిష్ఠ
మేల్కోని జిల్లా విద్యాశాఖ
ఈనాడు, గుంటూరు

‘మీ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం రూ.15వేలు సాయం చేస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత, వాటి నిర్వహణ  సమస్యలు తలెత్తకుండా అవి మన సొంతింట్లోలా ఉండాలంటే మీకిచ్చే సాయంలో నుంచి ఓ వెయ్యి వాటి అభివృద్ధికి ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు. ఈ డబ్బులతో మరుగుదొడ్ల నిర్వహణ, ఆయాలు, వాచ్‌మెన్లు వంటివి ఏర్పాటు చేసుకుని పాఠశాలను బాగా నడుపుకోవచ్చు. ఈ విషయంలో బలవంతం ఏమీ లేదు. అవి ఇచ్చినా, ఇవ్వకున్నా ఎవరినీ బలవంత పెట్టొద్దు. పదేపదే వాటి గురించి అడగకండి.

- ఈ నెల 9న చిత్తూరు ‘అమ్మఒడి’ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి సందేశమిది.

 

కానీ ఏం జరుగుతోందంటే...
ముఖ్యమంత్రి సందేశాన్ని జిల్లాలో కొందరు ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఇష్టానుసారం అన్వయించుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే వెయ్యి ఇవ్వమని చెప్పారు. ఆ మొత్తాన్ని తీసుకురావాలని నిత్యం పాఠశాలలో జరిగే అసెంబ్లీ సందర్భంగా పిల్లలను అడుగుతున్నారు. కొందరు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాఠశాలకు చేరుకుని వారు సైతం పిల్లలను ఆ మొత్తాన్ని ఇంట్లో అడిగి తీసుకురావాలని పట్టుబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా బలవంతపు వసూళ్లు బాగా జరుగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం నోరుమెదపడం లేదు.

జిల్లాలో 500 నుంచి 1600 మంది వరకు పిల్లలు కలిగిన పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇలాంటి చోట్ల రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తే ఆ మొత్తం రూ.ఐదారు లక్షలకు పైగా ఉంటుంది. వంద మంది ఉన్న పాఠశాలల్లోనే సగం మంది పిల్లలు ఇచ్చినా రూ.50 వేలు అవుతాయి. ఇంత పెద్ద మొత్తంలో వసూలయ్యే ఈ విరాళాలకు లెక్కాపత్రం, జవాబుదారీ ఉంటుందా? అనేది ఆలోచించాలి. మొత్తానికి ఇవి దుర్వినియోగం కావడానికి, పక్కదారీ పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ వెంటనే అప్రమత్తమై ఓ ప్రకటన ఇస్తే తప్ప బలవంతపు వసూళ్లకు చెక్‌పడదు. తల్లిదండ్రులు అప్రమత్తం కారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ నుంచి ఈ వసూళ్లకు సంబంధించి ఏరకమైన హెచ్చరికలు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు సైతం నిజమే కాబోలు అనుకుని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి ఇష్టపూర్వకంగానే ఇమ్మన్నారని చెప్పారు కదా? అలాంటప్పుడు పిల్లలను అసెంబ్లీలో అడగడం ఏమిటని ప్రశ్నిస్తే లేదు కచ్చితంగా రూ.వెయ్యి ఇవ్వాల్సిందేనని చెప్పి మరీ వసూలు చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి సందేశానికి విరుద్ధంగా ఎవరికివారు సొంత అభిప్రాయాలు జోడించి ఆ మేరకు తల్లిదండ్రుల కమిటీలను ముందుపెట్టి కొందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఏకాభిప్రాయంతో ఈ వసూళ్లకు తెరదీయడం ప్రశ్నార్థకమవుతోంది. కొందరు విద్యా కమిటీ ఛైర్మన్లు ఈ డబ్బులు వసూలు చేయడం కోసం పాఠశాలల్లోనే తిష్ఠ వేశారని సమాచారం.

జిల్లాలో సర్కారీ పాఠశాలలు 3756 ఉన్నాయి. వీటిల్లో సుమారు 4లక్షల మంది పిల్లలు ఉంటే అమ్మఒడి సాయానికి సుమారు 3.2 లక్షల మంది అర్హత సాధించారు. సాయాన్ని తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా అందజేస్తే తీసుకోవాలని ముఖ్యమంత్రి చెబితే ఆయన మాటలకు వక్రభాష్యం చెప్పి ప్రతి విద్యార్థిని రూ.వెయ్యి తీసుకురావాలని బలవంతం పెట్టడం నిజమేనని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో ఓ పాఠశాలలో 70 శాతం మంది విద్యార్థుల నుంచి వెయ్యి చొప్పున వసూలు చేశారని తెలిసింది. ఇక్కడ ఒకరిద్దరు పిల్లల తల్లిదండ్రులు ఎందుకివ్వాలని ఉపాధ్యాయులతో వాదులాటకు దిగిన ఉదంతాలు లేకపోలేదు. ఒక్క ఆ మండలంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా 57 మండలాల్లో ఈ వసూళ్ల తంతు నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని