
పంజాగుట్టలో దారుణం.. బాలికపై అత్యాచారం
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై జహంగీర్ అనే కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి వాచ్‌మన్‌గా పని చేస్తుండగా.. తల్లి ఇళ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిందితుడు జహంగీర్ వారు నివసిస్తున్న ఇంటి పక్కనే ఉంటున్నాడు. స్థానిక ఎంఎస్ మక్తాలో పంక్చర్ షాపు నడిపిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు లేని సమయంలో జహంగీర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసరికి నీరసంగా కూర్చున్న తన కూతుర్ని చూసి ఏమైందని తల్లి ఆరా తీయగా.. సదరు బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. గత పది రోజులుగా ఇలాగే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని వివరించింది. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.