సమత దోషులకు మరణశిక్ష

సమత హత్యోదంతం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది.

Published : 31 Jan 2020 01:39 IST

ఆదిలాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సమత హత్యోదంతం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. షేక్‌బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మఖ్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నవంబర్‌ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామం సమీపంలో సమతపై నిందితులుసామూహిక హత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. 

ఈ హేయమైన ఘటనపై ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 14న ఛార్జిషీటు దాఖలుకాగా.. డిసెంబర్‌ 23 నుంచి 31వరకు సాక్షుల విచారణ కొనసాగింది. జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ వాదనలు ప్రత్యేక కోర్టులో కొనసాగాయి.

కంటతడిపెట్టిన దోషి

తీర్పు వెలువరించే ముందు ఏమైనా చెప్పుకునేది ఉందా అని దోషులను న్యాయమూర్తి ప్రశ్నించారు. వారిపై మోపిన నేరం రుజువైందని తెలిపారు. దోషి షేక్‌బాబు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టాడు. తనకు వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా తమను క్షమించాలని విన్నవించుకున్నారు. అనంతరం వారికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. తీర్పు వెలువరిస్తూ ఈ ముగ్గురు దోషులు చేసిన నేరం చాలా ఘోరమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

రూ.26 వేల జరిమానా

నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు న్యాయమూర్తి రూ.26 వేల జరిమానా విధించారు. మొదటి దోషి నుంచి రూ.8 వేలు, మిగిలిన ఇద్దరి నుంచి చెరో రూ.9 వేల చొప్పున జరిమానా వసూలు చేయనున్నారు.

విచారణ జరిగిందిలా..

* సమతపై కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ వద్ద నవంబర్‌ 24న హత్యాచారం.

* నవంబర్‌ 27న నిందితులు షేక్‌ బాలు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మఖ్దూం అరెస్టు.

* కేసు విచారణకు డిసెంబర్‌ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు.

* డిసెంబర్‌ 14న నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు

* డిసెంబర్‌ 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ

* జనవరి 7,8 తేదీల్లో కొనసాగిన ప్రాసిక్యూషన్‌ వాదనలు.

* జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు.

* జనవరి 30న తుది తీర్పు వెల్లడి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు