వనస్థలిపురంలో నవవధువు ఆత్మహత్య

వివాహం జరిగి రెండు నెలలైనా కాలేదు.. అప్పుడే ఓ నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక సంఘటన నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన...

Published : 01 Feb 2020 01:07 IST

వనస్థలిపురం‌: వివాహం జరిగి రెండు నెలలైనా కాలేదు.. అప్పుడే ఓ నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక సంఘటన నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటకు చెందిన పల్లవి(28) ఎంబీఏ పూర్తి చేసింది. ఇంట్లో అందరూ ఆడపిల్లలే. వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన సోమవరం సంతోష్‌తో గత ఏడాది డిసెంబర్‌ 8న పల్లవికి వివాహం జరిగింది. సంతోష్‌ స్థానికంగా ఓ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. వివాహం సమయంలో కట్నంగా ఒక లక్ష రూపాయలు, పెళ్లి కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం ముందు పల్లవి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి భర్తకు గ్యాస్‌ ఏజెన్సీ నిర్వహణలో సహాయపడేది.

గురువారం సంతోష్‌ వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం అనారోగ్యంతో ఉన్న అత్తమామలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన అత్తమామలు పల్లవితో మాట్లాడేందుకు పలుమార్లు ఫోన్‌ చేయగా ఆమె తీయలేదు. దీంతో కంగారుపడిన అత్తమామలు పొరుగువారికి ఫోన్‌ చేసి తన కోడలు పల్లవిని పిలవాల్సిందిగా కోరారు. ఇంటి తలుపులు మూసి ఉన్నాయని పక్కింటి వారు చెప్పడంతో తలుపులు పగలగొట్టమని పక్కింటివారికి పల్లవి అత్తమామలు చెప్పారు. తలుపులు బద్దలుకొట్టి ఇంటి లోపలికి వెళ్లిన వారికి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న పల్లవి కనిపించింది. వెంటనే ఈ సమాచారాన్ని మృతురాలి భర్త, అత్తమామలకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాధితురాలు తల్లిదండ్రుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని