జూబ్లీహిల్స్‌లో చేపల వ్యాపారి దారుణహత్య

నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో మృతదేహం లభ్యమైంది. ఓ వ్యక్తిని దుండగులు హత్యచేసి గోనె సంచిలో మూటకట్టారు.

Published : 05 Feb 2020 00:48 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జవహర్‌ నగర్‌లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా రమేశ్‌ అనే చేపల వ్యాపారి  దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 1న రమేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఎస్‌ఆర్‌ నగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బోరబండలోని రామారావునగర్‌లో నివాసముండే రమేశ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి రమేశ్‌ ఆచూకీ కోసం రెండురోజులుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో రమేశ్‌ మృతదేహాన్ని గుర్తించడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఈనెల 1వ తేదీన రమేశ్‌ను అపహరించుకుపోయిన నిందితులు.. మరుసటి రోజే అతన్ని హతమార్చి గోనె సంచిలో చుట్టి గదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రమేశ్‌ను హత్య చేసిందెవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. రూ.కోటి ఇవ్వాలని ఫోన్‌లో డిమాండ్‌ చేసిన వ్యక్తులు.. ఆ ఫోన్‌ ఎక్కడి నుంచి చేశారనే వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రమేశ్‌ మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన ఫోన్‌ నంబర్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రమేశ్‌ ఇటీవల తనకున్న ఆస్తులను విక్రయించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. చేపల వ్యాపారంలో రమేశ్ బాగా సంపాదించుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తులే అతన్ని అపహరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని