కాషాయ ముసుగులో కామాంధుడు

భక్తిభావంతో ఆలయాలను దర్శించుకుంటున్న ఓ మహిళ సాధువు ముసుగులో ఉన్న ఓ కామాంధుడిని నమ్మి దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. నల్లమల అభయారణ్యంలో ఈనెల 2న లభ్యమైన మృతదేహం కేసులో వేగంగా దర్యాప్తు

Updated : 07 Feb 2020 07:21 IST

  శ్రీశైలానికి వచ్చిన ముంబయి మహిళపై అత్యాచారం, హత్య
  అక్కమహాదేవి ఆలయానికని తీసుకువెళ్లి అడవిలో అఘాయిత్యం

అచ్చంపేట పట్టణం, న్యూస్‌టుడే: భక్తిభావంతో ఆలయాలను దర్శించుకుంటున్న ఓ మహిళ సాధువు ముసుగులో ఉన్న ఓ కామాంధుడిని నమ్మి దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. నల్లమల అభయారణ్యంలో ఈనెల 2న లభ్యమైన మృతదేహం కేసులో వేగంగా దర్యాప్తు పూర్తిచేసిన నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీసులు గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అచ్చంపేటలో డీఎస్పీ నర్సింహులు, సీఐ బీసన్న ఈ కేసు వివరాలు తెలిపారు. ముంబయికి చెందిన మహిళ(52)కు దైవచింతన ఎక్కువ. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకునేది. గతేడాది డిసెంబరులో తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది. జనవరిలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సమంతమలైకి చెందిన సాధువు మట్కాస్వామి అలియాస్‌ పిలకస్వామి(62) కూడా పుణ్యక్షేత్రాలను తిరుగుతుంటాడు. కొద్దికాలంగా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ఉంటున్నాడు. అక్కడే ముంబయి మహిళకు కనిపించిన పిలకస్వామి అడవిలో ఉండే అక్కమహాదేవి ఆలయం మహిమాన్వితమైనదని, దర్శించుకుంటే మంచిదని చెప్పాడు. సాధువని నమ్మిన ఆమె ఆ ఆలయాన్ని చూపించాలని కోరింది. జనవరి 25న ఇద్దరూ కలిసి కొద్దిదూరం జీపులో, మరికొంత దూరం బస్సులో ప్రయాణించి నల్లమల అభయారణ్యంలోని అటవీశాఖ రేంజ్‌ గేటు-168 సమీపంలో దిగారు. కాలినడకన అక్కమహాదేవి గుహల వైపు బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక మట్కాస్వామి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి హత్యచేసి పారిపోయాడు. ఈనెల 2న అటుగా వెళ్లిన అటవీ సిబ్బంది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి ఈగలపెంట పోలీసులకు సమాచారం అందించారు. కొంతదూరంలో ఆ మహిళకు చెందిన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, శ్రీశైలంలో బసచేసిన గది రశీదులు దొరికాయి. ఆధార్‌కార్డు ఆధారంగా ముంబయిలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీశైలంలో ఆమె బసచేసిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని