మొగుడే ‘కాల్‌’ యముడు

భార్యాభర్తల బంధానికే మాయ తెచ్చాడు.. తనతో ఏడడుగులు నడిచి వచ్చిన యువతి ఫొటోలను ‘కాల్‌గర్ల్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టి విటులను ....

Updated : 07 Feb 2020 16:17 IST

భార్య ఫొటోలు పెట్టి విటుల ఆకర్షణ

హైదరాబాద్‌: భార్యాభర్తల బంధానికే మాయ తెచ్చాడు.. తనతో ఏడడుగులు నడిచి వచ్చిన యువతి ఫొటోలను ‘కాల్‌గర్ల్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టి విటులను ఆకర్షించాడు. వారిని ఇంటికే రప్పించి మందుతో విందు ఇచ్చేవాడు. అదే సమయంలో భార్యకూ తాగించి బయటికి వెళ్లిపోయేవాడు.. నెలలుగా ఈ నరకం అనుభవించిన యువతి పోలీసులను ఆశ్రయించడంతో గురువారం నిందితుడిని అరెస్టు చేశారు.

ప్రేమిస్తున్నానంటూ వెంటపడి.. ఛత్రినాక పరిధిలో  ఉంటున్న యువతికి నాలుగేళ్ల క్రితం ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని ఆమెను బెదిరించి రెండేళ్ల క్రితం బెంగళూరుకు తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేటలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఏ పనీ చేయకుండా రోజూ తాగుతుండటంతో యువతి అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్బు సంపాదిస్తానంటూ బంధువులు, స్నేహితులు, భార్య చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్‌గర్ల్స్‌గా పోస్ట్‌ చేయడం ప్రారంభించాడు. ఆ చిత్రాలు చూసిన వారి నుంచి డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేయించుకునేవాడు. అనంతరం వారిని ఇంటికి పిలిపించి స్నేహితులంటూ భార్యకు పరిచయం చేసేవాడు. అందరికీ మద్యం సరఫరా చేయాలనేవాడు. చేయకపోతే చిత్రహింసలు పెట్టేవాడు. బలవంతంగా భార్యతోనూ మద్యం తాగించి, విటులను ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లేవాడు. ఆమె భయంతో బంధువుల ఇళ్లకు వెళ్లేది. ఇలా ఏడాది పాటు కొనసాగాక విటుల్లో కొందరు గొడవకు దిగడంతో గత సెప్టెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడే బాధితురాలు అంబర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరచూ ఫోన్‌ నంబర్లు మార్చడం, గోవా, ముంబయిలకు నిందితుడు తిరుగుతుండడంతో పట్టుకోలేకపోయారు. ఎట్టకేలకు ఆచూకీ గుర్తించి గురువారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈలోపు ఆమె స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా, కాల్‌గర్ల్స్‌ విషయాన్ని చెప్పడంతో అంబర్‌పేట పోలీసుల సూచనల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని