ఈ ఫొటో చూస్తే.. నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయరు!

ద్విచక్రవాహనం అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వారిలో వాహనం నడిపిస్తున్న యువకుడు గాలిలోకి ఎగిరి ఫుట్‌పాత్‌ పక్కన ఉన్న ప్రహరీకి, విద్యుత్‌ స్తంభానికి మధ్య...

Updated : 11 Feb 2020 02:22 IST

వాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌కు ఢీ 

 ఇద్దరు యువకుల దుర్మరణం

రాయదుర్గం : ద్విచక్రవాహనం అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వారిలో వాహనం నడిపిస్తున్న యువకుడు గాలిలోకి ఎగిరి ఫుట్‌పాత్‌ పక్కన ఉన్న ప్రహరీకి, విద్యుత్‌ స్తంభానికి మధ్య తల ఇరుక్కుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కన్నపల్లికి చెందిన గొర్ల సంతోష్‌ (26) నగరంలోని విద్యానగర్‌ దయానంద్‌నగర్‌లో ఉంటూ రైల్వేలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన బావమరిది కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన అచ్చ రెహాన్‌ (21) నగరంలోనే ఉంటూ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యనభ్యసిస్తున్నాడు. వారిద్దరు ఆదివారం రాత్రి నానక్‌రాంగూడలోని తమ బంధువులను కలిసేందుకు కొత్తగా కొనుగోలు చేసిన యమహా ఎంటీ15 బైకు (టీఎస్‌ 07 బీడీటీఆర్‌ 6202)పై వచ్చారు. అదేరోజు రాత్రి 9.15 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. రెహాన్‌ వాహనం నడిపిస్తున్నాడు. నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌ వైపు వస్తుండగా ట్రిపుల్‌ ఐటీ కూడలి సమీపంలోని (ఐడీబీఐ బ్యాంకు అవతలివైపు) విద్యుత్‌ ఉపకేంద్రం వద్దకు రాగానే బైకు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. దీంతో రెహాన్‌ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ఫుట్‌పాత్‌ పక్కన ఉన్న గోడ, విద్యుత్‌ సంభం మధ్య తల ఇరుక్కుని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతను కూడా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంతోష్‌ బంధువు తిప్పని రాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించగా కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని