వృద్ధుడిని కాపాడిన చాయ్‌

అప్పుడే ఆ వృద్ధుడు ఇంటి నుంచి అలా బయటకు వెళ్లి చాయ్‌ తాగాడు.. అనంతరం ఓ దర్జీ దుకాణంలో కూర్చొన్న అతనికి పోలీసు వాహనాలు వరుసగా వెళ్తూ కనిపించాయి.

Updated : 15 Feb 2020 12:52 IST

పాతబస్తీలో జంట హత్యలు

హైదరాబాద్‌: అప్పుడే ఆ వృద్ధుడు ఇంటి నుంచి అలా బయటకు వెళ్లి చాయ్‌ తాగాడు.. అనంతరం ఓ దర్జీ దుకాణంలో కూర్చొన్న అతనికి పోలీసు వాహనాలు వరుసగా వెళ్తూ కనిపించాయి. ఏం జరిగిందోనని ముందుకు కదిలాడు. పోలీసులు తన ఇంటి వైపే వెళ్లేసరికి ఆందోళనకు గురయ్యాడు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు.. ‘నీకు తెలియదా.. ఇంట్లో రెండు హత్యలు జరిగాయి’ అంటూ వారు చెప్పడంతో కుప్పకూలిపోయాడు.. రక్తపు మడుగులో భార్య, కుమార్తె విగతజీవులై కనిపించడంతో శోకానికి అంతులేకుండా పోయింది.

చాంద్రాయణగుట్ట తాళ్లకుంటలో శుక్రవారం జరిగిన హత్యలు కలకలం రేపాయి. ఇక్కడ నివసిస్తున్న మహ్మద్‌ హుస్సేన్‌ భార్య షహజాదీబేగం, కుమార్తె ఫరీదాబేగంలు  ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా స్థానికులతో నిండిపోయింది. ఈ సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబేగం(32)కు పదహారేళ్ల వయసులోనే దుబాయికి చెందిన అబ్దుల్‌ అలీ బదర్‌తో నిఖా జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు నాసర్‌ అలీ, ఉమ్రా ఫాతిమా ఉన్నారు. భర్త చనిపోవడంతో కుమారుడు దుబాయ్‌లోనే ఉండిపోగా కుమార్తెను తీసుకుని ఫరీదా తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. బ్యుటీషియన్‌ కోర్సు నేర్చుకుని ఎనిమిదేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం సౌదీఅరేబియాకు వెళ్లింది. అక్కడ మాంసం దుకాణంలో పనిచేసే గుల్బర్గాకు చెందిన మహతాబ్‌ ఖురేషిని ప్రేమవివాహం చేసుకుంది. వారికి కుమార్తె తయ్యబా జన్మించింది.దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో ఖురేషి జైలుకెళ్లాడు. తరువాత ఫరీదా స్వదేశానికి వచ్చేసింది. భర్తతో అప్పడప్పుడూ చరవాణిలో మాట్లాడేది. ఫరీదాను నిఖా చేసుకోక ముందే ముంబయిలో ఖురేషికి మొదటిభార్య ఉండడం విశేషం. ఫరీదాతో గొడవల తరువాత బండ్లగూడకు చెందిన జరీనాను నిఖా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి సోదరుడు అబ్దుల్‌ రహమాన్‌ పాతబస్తీలో ఇల్లు కొనమని తన వదిన ఫరీదాకు డబ్బు పంపడం, అనంతరం జరిగిన గొడవలే హత్యలకు కారణమయ్యాయి. రహమాన్‌ పంపిన డబ్బుతో ఘాజిమిల్లత్‌కాలనీలో ఫరీదా తన తల్లి పేరిట కొనేసిన మూడంతస్తుల ఇల్లు వివాదానికి కేంద్రబిందువైంది. ఇల్లు తన పేరిట మార్చకపోవడం, డబ్బు కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో రహమాన్‌ చివరకు తన వదినను, ఆమె తల్లిని హత్య చేశాడు. ఆ ఇల్లును అమ్మి డబ్బు చెల్లించేయమని సూచించినా.. తన కూతురు మాట వినలేదని హుస్సేన్‌ వాపోయారు. తమ పోషణకోసం దుబాయ్‌ నుంచి మనవడు నాసర్‌ అలీ నెలకు రూ.50-60 వేలు పంపేవాడని చెప్పాడు. ఫరీదా కుమార్తెలిద్దరూ పాఠశాలకు వెళ్లడంతో క్షేమంగా  బయటపడ్డారని.. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదోనని స్థానికులు తెలిపారు.

నిఖా చేసుకున్న రహమాన్‌.. నిందితుడు రహమాన్‌ సౌదీ నుంచి వచ్చి బండ్లగూడ మిల్లత్‌కాలనీలో ఉంటున్నాడు. 4 నెలల క్రితమే నిఖా చేసుకున్నాడు. తన భార్యకు వరుసకు మామ అయిన ముల్తానీ ఖురేషితో కలిసి శుక్రవారం హత్యలు చేశాడు. ఇంటి నుంచే మాంసం కోసే కత్తిని తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని