గోత్రం పేరుతో కూతురి గొంతు కోశారు

ప్రేమ వివాహం చేసుకున్నందుకు హత్యలు చేసిన ఘటనలు చూశాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు కారణంతోనూ ప్రాణాలు తీసిన వార్తలు చదివాం. తాజాగా.. ఒకే గోత్రం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయిందో యువతి.

Published : 23 Feb 2020 02:14 IST

దిల్లీ: ప్రేమ వివాహం చేసుకున్నందుకు హత్యలు చేసిన ఘటనలు చూశాం. కులం, మతం, ఆస్తి, అంతస్తు కారణంతోనూ ప్రాణాలు తీసిన వార్తలూ చదివాం. తాజాగా.. ఒకే గోత్రం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయిందో యువతి. అదీ ఆమె తల్లిదండ్రుల చేతుల్లో కావడం గమనార్హం. తూర్పు దిల్లీలో పాల వ్యాపారం చేసే రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. దీంతో శీతల్‌ చౌదరి, అంకిత్‌ అనే యువతీ యువకులు ప్రేమించుకుని మూడు సంవత్సరాల పాటు రహస్యంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో గత అక్టోబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయితే చేసుకున్నారు కానీ, వాళ్లిద్దరూ వాళ్ల కుటుంబాలతోనే వేర్వేరుగా ఉన్నారు.

ఆ తర్వాత జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. అర్థం చేసుకోవడం పక్కనుంచితే.. కర్కశంగా ప్రవర్తించారు. కన్న కూతరని కూడా చూడకుండా గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు కారులో తూర్పు దిల్లీ నుంచి దాదాపు 80 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని సికంద్రాబాద్‌కు చేరుకుని కాలువలో మృతదేహాన్ని విసిరేసి వెళ్లిపోయారు.

ఇదంతా తెలియని అంకిత్‌. తన భార్య కనిపించకపోవంతో కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను విచారించారు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. నేరానికి పాల్పడ్డ వారితో పాటు అందుకు సహకరించిన వారందరినీ దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకే హతమార్చినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని