
చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
చిత్తూరు(న్యాయ విభాగం): బాలికపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్ రఫీ (27)ని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు న్యాయమూర్తి వెంకట హరినాథ్ ఈ తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబర్ 7న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుక కోసం జిల్లాలోని కురబలకోటకు వెళ్లింది. ఈ క్రమంలో నిందితుడు మహ్మద్ రఫీ.. బాలికకు మాయ మాటలు చెప్పి కల్యాణ మండపం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటనపై తల్లిదండ్రులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా న్యాయస్థానం 47 మంది సాక్షులను విచారించింది. దోషిగా తేలిన అనంతరం ఈరోజు మహ్మద్ రఫీకి మరణశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.