తుపాకితో కాల్చుకుని వైద్యుడి ఆత్మహత్య

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఒక వైద్యుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన వైద్యుడు రవీంద్రకుమార్‌

Updated : 10 Mar 2020 08:07 IST

కుటుంబ కలహాలే కారణమా?

జవహర్‌నగర్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఒక వైద్యుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన వైద్యుడు రవీంద్రకుమార్‌ (44), భార్య స్మిత, కుమారుడు ఆదిత్య (11)తో కలిసి సాకేత్‌లోని మిథిలా విల్లా 57లో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ వైద్యులే. దమ్మాయిగూడ పురపాలిక పరిధిలో వీరు 2015 నుంచి శ్రీ ఆదిత్యా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఇంటికీ, ఆసుపత్రికీ మూడు కి.మీ. దూరం ఉంటుంది. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం జరగడంతో ఆమె కుమారుడిని తీసుకుని దిల్‌సుఖ్‌నగర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. స్మిత సోదరి స్వప్న కూడా వీరి ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రవీంద్ర ఆసుపత్రికి రాకపోవడంతో స్మిత ఆయనకు ఫోన్‌ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఆమె రవీంద్ర ఇంటికి వచ్చి చూశారు. ఆయన తన గదిలో మంచంపై రక్తపుమడుగులో పడి ఉండడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటనస్థలానికి చేరుకున్న కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌, జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు వివరాలు ఆరా తీశారు. మృతదేహం పక్కనే తుపాకి, మూడు బుల్లెట్లను గుర్తించారు. మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రకుమార్‌కు ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఆయన సోదరి శశికళ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో మాజీ నక్సలైట్లు కొందరు రవీంద్రను డబ్బుల కోసం బెదిరించగా, వారిని ఆయన పోలీసులకు పట్టించారు. అప్పుడే ఆత్మరక్షణ కోసం లైసెన్స్‌డ్‌ తుపాకీ తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని