‘నా తప్పుంటే కళ్లలో యాసిడ్‌ పోయండి’

‘నేను ఏ తప్పూ చేయలేదు.. తప్పు చేసినట్లు రుజువైతే నా కళ్లలో యాసిడ్‌ పోయండి’ ఈ మాటలు ఉన్నావ్‌ అత్యాచార దోషి కులదీప్‌ సెంగార్‌ పలికినవి. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసుపై దిల్లీ కోర్టులో  న్యాయమూర్తి ధర్మేష్‌ శర్మ నేతృత్వంలో గురువారం విచారణ సాగింది.

Published : 13 Mar 2020 01:21 IST

దిల్లీ: ‘నేను ఏ తప్పూ చేయలేదు.. తప్పు చేసినట్లు రుజువైతే నా కళ్లలో యాసిడ్‌ పోయండి’ ఈ మాటలు ఉన్నావ్‌ అత్యాచార దోషి కులదీప్‌ సెంగార్‌ పలికినవి. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసుపై దిల్లీ కోర్టులో  న్యాయమూర్తి ధర్మేష్‌ శర్మ నేతృత్వంలో గురువారం విచారణ సాగింది. ఈ క్రమంలో సెంగార్‌ మాట్లాడుతూ..‘నేను ఏ తప్పూ చేయలేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే నా కళ్లలో యాసిడ్‌ పోయండి. నాకు న్యాయం చేయండి లేదా ఉరి తీయండి. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నన్ను విడిచి పెట్టండి’ అని న్యాయమూర్తిని వేడుకున్నారు. 

దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ..‘ కుటుంబం మీకే కాదు. అందరికీ ఉంది. కానీ నేరం చేసే ముందు మీరు ఇవన్నీ ఆలోచించి ఉండాలి. అన్ని చట్టాల్ని మీరు ఉల్లంఘించారు’ అని వెల్లడించారు. 

మరోవైపు సీబీఐ కూడా అత్యాచార బాధితురాలి తండ్రి మృతికి కారణమైన సెంగార్‌తో పాటు మఖి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని పేర్కొంది. ప్రజా సేవకులైన ఇద్దరు పోలీసులు శాంతి భద్రతలు రక్షించకుండా కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టుకు తెలిపింది. అనంతరం కోర్టు ఈ విచారణను శుక్రవారం కొనసాగించనున్నట్లు తెలిపింది. 

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో కులదీప్‌ సెంగార్‌ సహా మరో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ మార్చి 4న దిల్లీ కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. యూపీలోని వున్నావ్‌కు చెందిన ఓ మైనర్‌ యువతిని 2017లో అత్యాచారం చేసిన కేసులో సెంగార్‌ దోషిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా బాధితురాలు తండ్రితో పాటు.. రోడ్డు ప్రమాదంలో కుటుంబసభ్యుల్ని సైతం కోల్పోయింది. కాగా ఆమె ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ సంరక్షణలో ఉంటోంది. గతేడాది డిసెంబర్‌ 20న సెంగార్‌కు దిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు