మాస్కులిస్తామని మస్కా కొట్టాడు

కరోనా(కోవిడ్‌-19) వైరస్‌పై ప్రజలకు ఉన్న భయాన్ని, మాస్క్‌లకు ఉన్న డిమాండ్‌ను సైబర్‌ నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా మాస్క్‌లు కొనుగోలు చేస్తున్న వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని అవసరమైన వాటికన్నా

Published : 13 Mar 2020 06:45 IST

 

వైద్యుడి నుంచి రూ.4.13లక్షలు స్వాహా
ఈనాడు, హైదరాబాద్‌

కరోనా(కోవిడ్‌-19) వైరస్‌పై ప్రజలకు ఉన్న భయాన్ని, మాస్క్‌లకు ఉన్న డిమాండ్‌ను సైబర్‌ నేరస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా మాస్క్‌లు కొనుగోలు చేస్తున్న వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని అవసరమైన వాటికన్నా ఎక్కువగా అందిస్తామని, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చని..ముందుగా 30శాతం బయానా చెల్లిస్తే చాలంటున్నారు. వీరి మాటలను నమ్మి నగరానికి చెందిన ఓ వైద్యుడు రూ.4.13లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

మూడు మాస్క్‌లకు ఆర్డరిస్తే..  యాకుత్‌పురాలో క్లినిక్‌  నిర్వహించే ఓ వైద్యుడు సాధారణ మాస్కులు మార్కెట్‌లో లభించకపోవడంతో తాను వ్యక్తిగతంగా వినియోగించేందుకు మూడు సర్జికల్‌ మాస్కుల కోసం అన్వేషించారు. ఒక ఈ-కామర్స్‌ సంస్థ వెబ్‌సైట్‌లో గత నెల 18న ఆర్డర్‌ చేశాడు. వైద్యుడి వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరస్థుడు అదే నెల 20న పీటర్‌ పేరుతో ఫోన్‌ చేశాడు. మీకు కావాల్సిన మాస్క్‌లను పంపుతామని.. మీ వద్దకు వచ్చే రోగులు, వారి సహాయకులకు వాటిని విక్రయిస్తే లాభాలొస్తాయంటూ చెప్పాడు. ప్రస్తుతం తమ వద్ద 50 కార్టన్ల మాస్కులున్నాయని, ఒక్కో కార్టన్‌ రూ.30వేల చొప్పున ఇస్తామని తెలిపాడు. ఒక్కో కార్టన్‌లో 3వేల మాస్కులుంటాయని రూ.60వేలకు విక్రయించుకోవచ్చని ఆశ చూపించాడు. నిందితుడు చెప్పిన మాస్క్‌ ప్రత్యేకతలు, కంపెనీ వివరాలను వైద్యుడు అంతర్జాలంలో చూశాడు. అంతా సరిగానే ఉందని తెలుసుకున్నాక పీటర్‌కు ఫోన్‌ చేసి తనకు 50 కార్టన్ల మాస్కులు కావాలని చెప్పాడు. బయానాగా రూ.4.13లక్షలను గత నెల 24న నిందితుడి ఖాతాకు బదిలీ చేశాడు. వారమైనా సరకు రాకపోవడంతో పీటర్‌కు ఫోన్‌చేయగా.. మరో వారం పడుతుందని చెప్పాడు.  అన్నట్లే వేచిచూసినా రాకపోవడంతో వైద్యుడికి అనుమానం వచ్చి ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో  పోలీసులను ఆశ్రయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని