ప్రేమను పూడ్చేశాడు !

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతని కుటుంబసభ్యులు పథకం ప్రకారం కడతేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కురబలకోట మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి

Updated : 25 Mar 2020 08:53 IST

కురబలకోటలో దారుణం

రెండు నెలల తర్వాత వెలుగులోకి


గాయత్రి (పాతచిత్రం)

పెద్దపల్లె (మదనపల్లె నేరవార్తలు): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతని కుటుంబసభ్యులు పథకం ప్రకారం కడతేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కురబలకోట మండలంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి తల్లి కథనం మేరకు.. పట్టణంలోని ఎన్‌వీఆర్‌ వీధికి చెందిన కుమారి, భాస్కర్‌ల కుమార్తె జి.గాయత్రి (28) తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసింది. ఆమెను కురబలకోట మండలం వనమరెడ్డిగారిపల్లెకు చెందిన మల్‌రెడ్డి 2019 ఫిబ్రవరి 12న ప్రేమ వివాహం చేసుకున్నాడు. తిరుపతి నుంచి మదనపల్లెకు వచ్చే ఆర్టీసీ బస్సులో రోజూ ప్రయాణించే గాయత్రిని ఆ అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న మల్‌రెడ్డి ప్రేమించాడు. దీంతో వీరిద్దరు పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మల్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు గాయత్రిని అనుమానించడంతో పాటు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులపై 2019సెప్టెంబరు 10న ముదివేడు పోలీసులకు గాయత్రి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి గొడవలు పడకుండా కాపురం చేసుకోవాలని భార్యాభర్తలిద్దరిని పంపించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీ నుంచి గాయత్రి కన్పించకుండా పోవడంతో 6వ తేదీన మల్‌రెడ్డి మదనపల్లె రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన భార్య కన్పించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి రూరల్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లి కుమారి తన కుమార్తె కన్పించకుండా పోవడం వెనుక అల్లుడు, అతని కుటుంబసభ్యుల హస్తం ఉందని తనకు జనవరి 2వ తేదీన గాయత్రి ఫోన్‌ చేసి ప్రాణహాని ఉందని చెప్పిందని ఆమె ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ముదివేడు పోలీసులు విచారణ నిర్వహించి భర్త, అతని కుటుంబ సభ్యులను తమదైన శైలిలో విచారించారు. దీంతో గాయత్రిని చంపేసి పొలంలో పూడ్చిపెట్టినట్లు మల్‌రెడ్డి ఒప్పుకోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతనికి సహకరించిన వారికోసం గాలింపు చేపట్టారు. మంగళవారం మదనపల్లె రూరల్‌ సర్కిల్‌ సీఐ అశోక్‌కుమార్‌, ముదివేడు ఎస్సై సుకుమార్‌లు గ్రామానికి వెళ్లి విచారించారు. మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు అనుమానిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత కేసు మార్పు చేస్తామని సీఐ తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు. తన కుమార్తె మృతికి ఆమె భర్త మల్‌రెడ్డి, అత్త లక్ష్మీదేవి, మరిది కార్తీక్‌, మల్‌రెడ్డి స్నేహితులు అమర్‌, సుధాకర్‌లే కారణమని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. తన బిడ్డను చంపేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కన్నీటిపర్యంతమౌతోంది. తన భర్త భాస్కర్‌ మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడని ఇప్పుడు కుమార్తె కూడా మృతి చెందిందని ఆమె రోదించడం అందరిని కలచివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని