కరోనా సహాయ కేంద్రానికి సమాచారం..వ్యక్తి హత్య!

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

Published : 01 Apr 2020 01:06 IST

సీతమర్హి(బిహార్‌): కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి.

తాజాగా ఇలాంటి సహాయ కేంద్రానికి సమాచారమిచ్చిన వ్యక్తిపై దాడిచేసి హత్య చేసిన అమానుష ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. బిహార్‌లోని సీతామర్హి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లాక్‌డౌన్‌ సమయంలో మహారాష్ట్ర నుంచి వారి స్వస్థలం సీతామర్హికి చేరుకున్నారు. ఇది గ్రహించిన స్థానిక యువకుడు ఈ విషయాన్ని అక్కడి కరోనా సహాయ కేంద్రానికి తెలిపాడు. విషయం తెలుసుకున్న అధికారులు వారి ఇంటికి వచ్చి ఆ ఇద్దరితో పాటు కుటుంబసభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఇరువురి కుటుంబాలు, సమాచారం ఇచ్చిన వ్యక్తిపై దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి 20ఏళ్ల బబ్లూ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ హత్యను తీవ్రంగా ఖండించిన జేడీయూ ప్రభుత్వం పూర్తి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని