
దాక్కుంటే శిక్ష తప్పదు
భోపాల్: నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తులు వెంటనే అధికారుల వద్ద రిపోర్టు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదేశించారు. బయటకు రాకుండా దాచుకున్న తబ్లిగీలు 24 గంటల్లో రిపోర్టు చేయకపోతే తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత నెల్లో దిల్లీలో తబ్లిగీ జమాత్ మత సమ్మేళనం జరిగింది. విదేశీయులు సైతం అందులో పాల్గొనడంతో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు వేగంగా పెరగడానికి ఈ ఘటన కారకంగా మారింది. ‘రాష్ట్రం నుంచి నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొన్న వారిని ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. మసీదుల్లో దాచుకున్న కొందరు విదేశీయులను ప్రభుత్వం గుర్తించింది’ అని చౌహాన్ పేర్కొన్నారు.
‘గుర్తించినా.. ఇంకా కొందరు ఎక్కడో దాక్కొని ఉన్నారు. 24 గంటల్లో వారంతా అధికారుల వద్ద సమాచారం ఇవ్వాలని కోరుతున్నా. అలా చేయకపోతే రాష్ట్ర, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించి తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం’ అని చౌహాన్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బుధవారం మధ్యాహ్నానికి 229 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతిచెందారు.