పోలీసు విచారణకు తబ్లిగీ జమాత్‌ అధినేత

క్వారంటైన్‌ ముగియగానే తబ్లిగీ జమాత్‌ ప్రధాన నేత మౌలానా సాద్‌ ఖాందల్వి విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. సాద్‌ సహా ఏడుగురిపై దిల్లీ పోలీసు నేర విభాగం మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని..

Updated : 09 Apr 2020 01:49 IST

క్వారంటైన్‌ పూర్తవ్వగానే మౌలానా సాద్‌ ఖాందల్వి వస్తారన్న న్యాయవాది

దిల్లీ: క్వారంటైన్‌ ముగియగానే తబ్లిగీ జమాత్‌ ప్రధాన నేత మౌలానా సాద్‌ ఖాందల్వి విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. సాద్‌ సహా ఏడుగురిపై దిల్లీ పోలీసు నేర విభాగం మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యక్తిగత దూరం పాటించలేదని నిజాముద్దీన్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు చేశారు.

నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 91 ప్రకారం వివరాలు కోరుతూ దిల్లీ నేర విభాగం బుధవారం సాద్‌కు లేఖ రాసింది. ‘ప్రస్తుతం సాద్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. 14 రోజుల గడువు పూర్తవ్వగానే విచారణకు హాజరవుతారు’ అని ఆయన తరఫున న్యాయవాది తౌసీఫ్ ఖాన్‌ మీడియాకు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. మార్చి 21న మర్కజ్‌ నిర్వాహకులను పోలీసు అధికారులు సంప్రదించారు. రాజకీయ, మతపరమైన కార్యక్రమాలకు 50 కన్నా ఎక్కువమంది హాజరవ్వకుండా ప్రభుత్వం నిషేధం విధించిందని వివరించారు. అయినప్పటికీ పోలీసుల మాటను ఎవ్వరూ లెక్కచేయలేదు. పైగా లాక్‌డౌన్‌ను ఎవ్వరూ పాటించొద్దని, మర్కజ్‌ మత సమ్మేళనానికి హాజరు కావాలని అనుచరులకు సాద్‌ పిలుపునిచ్చిన అనుమానాస్పద ఆడియో ఒకటి మార్చి 21న వాట్సాప్‌లో వైరల్‌ కావడాన్ని గుర్తించారు.

మార్చి 24న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ అమలు చేసింది. సామాజిక, రాజకీయ, మత సమావేశాలపై ఆంక్షలు విధించింది. అదే రోజు మర్కజ్‌ నిర్వాహకులు, నిజాముద్దీన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో మధ్య సమావేశం జరిగింది. సాద్‌, మహ్మద్‌ అష్రాఫ్‌, మహ్మద్‌ సల్మాన్‌, యూనుస్‌, ముర్సలీమ్‌ సైఫి, జిషాన్‌, ముఫ్తీ షెహజాద్‌కు లాక్‌డౌన్‌ నిబంధనల గురించి అధికారులు వివరించారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ప్రయత్నించినా ఆరోగ్య శాఖ, ప్రభుత్వ అధికారులకు భారీ జన సమ్మేళనం గురించి చెప్పకుండా వారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారని గుర్తించారు.

డిఫెన్స్‌ కాలనీ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ మర్కజ్‌ ప్రాంతాన్ని చాలాసార్లు తనిఖీ చేసి విదేశీయులు సహా 1300 మంది వ్యక్తిగత దూరం పాటించకుండా ఒకే వద్ద ఉన్నారని గుర్తించారు. ఫేస్‌ మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు సైతం లేవని గ్రహించారు. ఇప్పటి వరకు 25,500 మంది తబ్లిగీలు, వారి ప్రాథమిక కాంటాక్టులను ప్రభుత్వాలు క్వారంటైన్‌కు పంపించాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ భారీ ఆపరేషన్‌ నిర్వహించి వీరిని గుర్తించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమ్మేళనంలో కనీసం 9000 మంది పాల్గొన్నారు. అందులో చాలామంది దేశవ్యాప్తంగా ప్రయాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని