భూ వివాదంలో తమ్ముడికి చిత్రహింసలు

ఒకే పేగు పంచుకు పుట్టారు.. కలిసి పెరిగారు. తల్లి లాంటి భూమి విషయంలో ఘర్షణ పడ్డారు. తండ్రి లాంటి అన్న అత్యంత పాశవికంగా తమ్ముడిని కడతేర్చాలని చూశాడు..

Updated : 08 Dec 2022 17:50 IST

కందనూలు, న్యూస్‌టుడే: ఒకే పేగు పంచుకు పుట్టారు.. కలిసి పెరిగారు. తల్లి లాంటి భూమి విషయంలో ఘర్షణ పడ్డారు. తండ్రి లాంటి అన్న అత్యంత పాశవికంగా తమ్ముడిని కడతేర్చాలని చూశాడు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తిలో ఏప్రిల్‌ నెల 29న చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తూడుకుర్తికి చెందిన గుంటి కురుమయ్య, తిరుపతయ్య అన్నదమ్ములు. వీరికి తూడుకుర్తిలో పొలం ఉంది. దీని పంపకం విషయంలో తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. గత నెల 29న తిరుపతయ్య పొలంలో పని చేస్తుండగా ట్రాక్టరు కూరుకుపోయింది. సాయంత్రం ట్రాక్టరు తీసుకురావటానికి పొలం దగ్గరికి తిరుపతయ్య రాగా అతడి అన్న కురుమయ్య ముందస్తు పథకం ప్రకారం కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అందరూ కలిసి తిరుపతయ్యపై తీవ్రంగా దాడిచేసి తాడుతో కట్టి లాక్కెల్లి సమీపంలోని చెట్టుకు ఉరివేసే ప్రయత్నం చేశారు. తిరుపతయ్య కుమారుడు ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతోపాటు స్థానికులకు సమాచారం అందించాడు. గమనించిన కురుమయ్య కుటుంబసభ్యులు పారిపోయారు. దాడిలో తిరుపతయ్య తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని