హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేస్తే రెండు లక్షలు కొట్టేశారు

కరోనా వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఈ-కామర్స్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రజలు సమాచారం కోసం సదరు సంస్థల హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తుండంటంతో....

Published : 04 May 2020 01:17 IST

ముంబయి: కరోనా వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఈ-కామర్స్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రజలు సమాచారం కోసం సదరు సంస్థల హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తుండంటంతో....ఇదే అదనుగా కొందరు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి తప్పుడు హెల్ప్‌లైన్‌ నంబరుకి ఫోన్‌ చేయడంతో ఆయన ఖాతా నుంచి రూ.2.22 లక్షలు కొట్టేశారు. ముంబయిలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఏప్రిల్ 22న 40 ఏళ్ల వ్యాపారి ఆన్‌లైన్‌లో నిత్యావసరాలను ఆర్డర్‌ చేశాడు. కొద్దిరోజులకు సదరు కంపెనీ వాటిని డెలివరీ చేసింది. అయితే తను ఆర్డర్‌ చేసిన జాబితాలోని రూ.400 విలువ కలిగిన రెండు స్నాక్స్‌ ప్యాకెట్లు రాకపోవడంతో... వాటి గురించి విచారించేందుకు మే 1 తేది ఆన్‌లైన్‌లో సదరు సంస్థ హెల్ప్‌లైన్‌ నంబరు కోసం వెతికాడు. అందులో ఎక్కువ మంది ఫోన్‌ చేసినట్టు రేటింగ్ ఉన్న నంబరుకు ఆయన ఫోన్‌ చేశాడు. తనకు డెలివరీ కాని వస్తువుల గురించి ఫోన్‌లో అడగ్గా, అవతలి వ్యక్తి వ్యాపారి బ్యాంక్‌ ఖాతా, రిజిస్టర్డ్‌‌ ఫోన్ నంబర్‌, ఏటీఎం కార్డు సీవీవీ నంబరు అడిగాడు. తర్వాత వ్యాపారి ఫోన్‌కు ఒక లింక్‌ పంపి, దాన్ని మరో మొబైల్‌ నంబర్‌కి పంపమని సూచించాడు. అలానే యుపిఐ పిన్‌, ఓటిపి నంబరు అగడంతో వాటి వివరాలను ఆయన సదరు వ్యక్తికి తెలియజేశాడు. రెండు గంటల తర్వాత వ్యాపారి ఖాతా నుంచి రూ.2.25 లక్షలు విత్‌డ్రా అవ్వడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

దీని గురించి సైబర్‌క్రైమ్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘వ్యాపారి బ్యాంక్‌ ఖాతా, ఓటీపీ వివరాలు తెలుసుకునేందుకు నేరస్థుడు తెలివిగా వ్యవహరించాడు. బ్యాంక్‌ ఖాతా, ఓటీపీ, సీవీవీ వివరాలు ఎవరితో షేర్‌ చేయవద్దని పదే పదే బ్యాంకులు ప్రజలను అభ్యర్థిస్తున్నప్పటికీ...కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడటంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చూసయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని అన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని