యువకులపై సైబర్‌ వల

నగరంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. రెండు వరుస ఘటనల్లో ఒకే రోజు రూ.లక్షకు పైగా సొమ్మును లూటీ చేశారు. స్నేహితురాలికి సాయం చేయబోయి ఓ యువకుడు మోసపోగా.. ఉద్యోగం వచ్చిందని ఎర వేసి మరో యువకుడి నుంచి కూడా సైబర్‌

Published : 04 May 2020 02:17 IST

హైదరాబాద్‌: నగరంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. రెండు వరుస ఘటనల్లో ఒకే రోజు రూ.లక్షకు పైగా సొమ్మును లూటీ చేశారు. స్నేహితురాలికి సాయం చేయబోయి ఓ యువకుడు మోసపోగా.. ఉద్యోగం వచ్చిందని ఎర వేసి మరో యువకుడి నుంచి కూడా సైబర్‌ నేరగాళ్లు సొమ్మును కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫర్వేద్‌ అనే యువకుడు తన స్నేహితురాలికి సాయం చేసే క్రమంలో రూ.96 వేలు మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫర్వేద్‌ తన స్నేహితురాలికి గూగుల్‌ పే ద్వారా రూ.2 వేలు పంపాడు. నగదు జమకాకపోవడంతో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం గూగుల్‌లో వెతికాడు. ట్రాన్సాక్షన్‌ పూర్తి కావాలంటే ఎనిడెక్స్‌ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సైబర్‌ నేరగాళ్లు సూచించారు. యాప్ ద్వారా రూ.25 వేలు పంపిస్తే తిరిగి పంపిస్తామని చెప్పారు. రూ. 25 వేలు పంపగా.. అదే అదునుగా మరో 4 ఓటీపీల ద్వారా రూ.96వేలు లూటీ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో ఘటనలో దూద్‌బౌలి ప్రాంతంలో జరిగింది. ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. కొటక్‌ మహీంద్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంటూ హైదరాబాద్‌  దూద్‌బౌలికి చెందిన మనీష్‌ గౌడ్‌కు ఓ మహిళ కాల్‌ చేసింది.  ప్రాసెసింగ్‌, ఇంటర్వ్యూ ఫీజు పేరుతో రూ.27 వేలు అడగ్గా.. మనీష్‌ సదరు అకౌంట్‌కు ఆ మొత్తాన్ని ట్రాన్‌ఫర్‌ చేశాడు. అనంతరం ఆ నెంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా.. ఎప్పటికీ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని