లాక్‌డౌన్‌: 300కి.మీ నడిచి..మార్గమధ్యంలోనే!

దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ వలస కార్మికులకు విషాధాన్నే మిగులుస్తోంది. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నడకదారిన వందల కి.మీ వెళ్తూ వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు మార్గమధ్యంలోనే మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 14 May 2020 01:12 IST

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ వలస కార్మికులకు విషాదాన్నే మిగులుస్తోంది. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నడకదారిన వందల కి.మీ వెళ్తూ వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు మార్గమధ్యంలోనే మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బస్సులు, శ్రామిక్‌ రైళ్లలో వలస కార్మికులు ప్రయాణించాలని సూచిస్తున్నా.. వారి సొంత ప్రయత్నాలను మానడం లేదు. తాజాగా హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు బయలుదేరిన ఓ యువకుడు 300కి.మీ నడచిన అనంతరం కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.  

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఓ 21ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని వ్యాపారాలు మూతపడడంతో తన స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ ఆదివారం కాలినడకన వారి సొంత రాష్ట్రానికి ప్రయాణమయ్యారు. దాదాపు 300కి.మీ నడిచిన వీరంతా మరుసటి రోజు భధ్రాచలం చేరుకున్నారు. ఆ సమయంలో వీరిలో ఓ యువకుడు తీవ్ర ఛాతీనొప్పి, వాంతులతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి స్నేహితులు పోలీసుల సహాయంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరైన ఆహారం, నీరు లేకపోవడంతో వడదెబ్బ కారణంగా యువకుడు మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోలేదని ఆ యువకులు చెప్పడం వలస కార్మికుల దుస్థితికి అద్దం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని