భర్త చెవిలోంచి..భార్య మెడలోకి బుల్లెట్‌

తుపాకీతో కాల్చుకుంటే ఆ బుల్లెట్‌ తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో వ్యక్తిలోకి చొచ్చుకుపోయిన ఘటన హరియాణాలో జరిగింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం....

Published : 25 May 2020 01:28 IST

దిల్లీ: తుపాకీతో కాల్చుకుంటే ఆ బుల్లెట్‌ తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మరో వ్యక్తిలోకి చొచ్చుకుపోయిన ఘటన హరియాణాలో జరిగింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి ఆవేశంతో తన తుపాకీతో చెవిలో కాల్చుకున్నాడు. అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న తన భార్య మెడలోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉండగా.. గర్భవతి అయిన ఆయన భార్య మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఫైరదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం గురుగ్రామ్‌లోని రామ్‌పురాలో అద్దెకు ఉంటున్నాడు. ఇప్పటికే అతనికి రెండు పెళ్లిల్లయ్యాయి. 2017లో మొదటి భార్యకు దూరమైన అతను 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక నిత్యావసర వస్తువుల దుకాణంలో పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహానికి దారి తీసింది. అయితే, గత కొంతకాలంగా పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం రెండో భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం కారులో తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో ఉద్యోగ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో కారులో ఉన్న తుపాకీ తీసుకొని తన చెవిలో కాల్చుకున్నాడు. దీంతో తలలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్‌ పక్కనే ఉన్న అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులో ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారమందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దంపతులిద్దరిని దిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఐసీయూలో విషమ పరిస్థితిలో ఉన్నాడు. అతని భార్య మాత్రం ప్రాణాల నుంచి బయటపడింది. ఉద్యోగం విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగుతోందని అతడి భార్య పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు తుపాకీకి లైసెన్స్‌ ఉందో.. లేదో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని