Updated : 28 May 2020 07:22 IST

బోరుబావిలో పడిన బాలుడి మృతి

పాపన్నపేట: మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది.‌ 17 అడుగుల లోతు నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే  బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు ఆక్సిజన్‌ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. 150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో సాయివర్థన్‌ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించి.. బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో  మరో గొయ్యి తవ్వి దాదాపు 8.30  గంటల పాటు సహాయక బృందాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సాయివర్ధన్‌ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టరు ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు సంఘటన స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బోర్లు విఫలమైతే వెంటనే పూడ్చివేయాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు.

సాగు కోసం బోర్లు
పొడ్చన్‌పల్లికి చెందిన భిక్షపతికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి నవీనను పటాన్‌చెరుకు చెందిన గోవర్ధన్‌కిచ్చి వివాహం జరిపించారు. వారి ముగ్గురు కుమారుల్లో సంజయ్‌ సాయివర్ధన్‌ ఒకడు. ఫొటోగ్రాఫర్‌ అయిన గోవర్ధన్‌ లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో భార్య, పిల్లలతో కొద్ది రోజుల క్రితం అత్తారింటికి వచ్చారు. భిక్షపతికి నాలుగెకరాల పొలముంది. నీటి వసతి లేకపోవడంతో ఈ సారి సాగు చేయబోమని కౌలు రైతులు చెప్పడంతో బోర్లు తవ్వించి సొంతంగా సాగు చేద్దామని భావించారు. ఈనెల 26న ఒక బోరు తవ్వించారు. నీళ్లు రాకపోవడంతో.. ఈనెల 27న మరో రెండు తవ్వించడం మొదలుపెట్టారు. ఒక్క బోరులోనైనా నీరు పడుతుందని ఆశ. కానీ 120, 150, 170 అడుగుల లోతుతో మూడు బోర్లు తవ్వించినా నీటి చెమ్మ జాడ కానరాలేదు. ఆ కుటుంబానికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక సాయంత్రం బోరు బండి యజమానికి డబ్బు చెల్లించేసి అంతా ఇంటి బాటపట్టారు.

భిక్షపతి భార్య లక్ష్మి, కుమార్తె నవీన, మిగతా ఇద్దరు పిల్లలు ముందు వెళుతుండగా... మూడున్నరేళ్ల సంజయ్‌ తాత, తండ్రితో కలిసి పొలంలో నడుస్తున్నాడు. తాత చేయి పట్టుకొని నడిచిన బాలుడు మొదట తవ్వించిన బోరు బావి వద్దకు వెళ్లాడు. ఆసక్తిగా అందులోకి తొంగిచూస్తూ ప్రమాదవశాత్తూ పడిపోయాడు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts