కన్న పేగు కాదనుకుంది.. సమాజం ఆదుకుంది!

కన్న పేగు తనను ఎందుకు వద్దనుకుందో కారణం తెలీదు..తనను అక్కడ ఎవరు సజీవ సమాధి చేశారో తెలీదు..కానీ బతకాలన్న ఆ పసికందు ఆరాటం ముందు మృత్యువు కూడా చిన్నబోయింది. తన ఉనికిని....

Published : 29 May 2020 03:22 IST

లఖ్‌నవూ: కన్న పేగు తనను ఎందుకు వద్దనుకుందో కారణం తెలీదు.. తనను అక్కడ ఎవరు సజీవ సమాధి చేశారో తెలీదు.. కానీ బతకాలన్న ఆ పసికందు ఆరాటం ముందు మృత్యువు కూడా చిన్నబోయింది. తన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలని ఆ పసికందు చేసిన ఆర్తనాదం.. అటుగా పోతున్నవారి చెవిన పడటంతో ప్రాణాలతో బయటపడింది. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధ్‌ నగర్‌ జిల్లా సోనౌరా గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సోనౌరా గ్రామంలో కొందరు గ్రామస్థులకు భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం నుంచి పసికందు ఏడుపు వినిపించింది. దీంతో వారంతా ఏడుపు వినిపించిన ప్రదేశానికి చేరుకుని పరికించి చూడగా అక్కడ వారికి కాలు మాత్రం బయటకు కనపడుతూ మిగతా శరీర భాగం మట్టిలో కూరుకుపోయిన పసికందు కనబడింది. వెంటనే వారు జాగ్రత్తగా పసికందును బయటికి తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పసికందును శుభ్రం చేసి వైద్య పరీక్షలు నిర్వహించి పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్దిగా మట్టి నోట్లోకి వెళ్లడంతో దాన్ని శుభ్రం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని