సినిమా పాత్రను అనుకరిస్తూ..మహిళలే లక్ష్యంగా..

యువతులను మోసం చేసి, వారి నుండి డబ్బు గుంజేందుకు ఓ ఘరానా మోసగాడు బాలీవుడ్ చిత్రం కబీర్‌ సింగ్‌లో వైద్యుడి పాత్రను అనుకరించాడు.

Published : 31 May 2020 00:46 IST

దిల్లీ: యువతులను మోసం చేసి వారి నుంచి డబ్బు గుంజేందుకు ఓ ఘరానా మోసగాడు బాలీవుడ్ చిత్రం ‘కబీర్‌ సింగ్’‌లో వైద్యుడి పాత్రను అనుకరించాడు. ఈ చిత్రం టాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యక్తి తనకు తాను కీళ్ల వైద్య నిపుణుడిగా పేర్కొంటూ అమ్మాయిలను ఆకర్షించేవాడు. వారిని వివాహం చేసుకుంటానని.. వ్యక్తిగత చిత్రాలను, వీడియోలను పంపమని అడిగేవాడు. అనంతరం తన తల్లి వైద్యానికి అవసరమంటూ వారి నుంచి డబ్బు రాబట్టేవాడు. ఆ వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఆనంద్‌ కుమార్‌ దిల్లీలో ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నడిపేవాడు. టిండర్‌, బంబల్‌ వంటి డేటింగ్‌ యాప్‌లు, పలు మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో డాక్టర్‌ రోహిత్‌ గుజ్రాల్‌ పేరుతో ఓ నకిలీ ప్రొఫైల్‌ ఉంచాడు. తన వద్దకు మోడల్‌ కావాలని వచ్చిన ఓ యువకుడి చిత్రంతో ఈ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేశాడు. వీటి‌ ద్వారా ఓ వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఖాతాలో రూ.30,000 వేయించుకున్నాడు. అనంతరం ఆమె వ్యక్తిగత వీడియోలు, చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు.

ఈ మోసగాడి మాయమాటలు నమ్మిన మరో యువతి రూ.5 లక్షలు రుణం తీసుకొని మరీ అతనికి ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ విధంగా గత నాలుగు నెలల్లో అనేక మందిని మోసం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారాన్ని అతని యాప్‌లో సమాచారం ద్వారా కనిపెట్టిన లజ్‌పత్‌నగర్‌ పోలీసులు ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ప్రియం యాదవ్‌ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ‘కబీర్‌సింగ్‌’ చిత్రం చూసిన అనంతరం వైద్యుడి వేషం వేయాలనే ఆలోచన వచ్చిందని నిందితుడు పోలీసు విచారణలో తెలిపాడు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని