ఏనుగు మరణం: తిన్నది పైనాపిల్‌ కాదట...

గర్భిణిగా ఉన్న ఏనుగు మరణించిన ఘటనకు సంబంధించిన ఆధారాల సేకరణను అధికారులు కొనసాగించారు.

Updated : 06 Jun 2020 17:25 IST

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందిన అమానుష ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలను అటవీ అధికారులు వెల్లడించారు.

మరణించిన ఏనుగు తిన్నది అందరూ భావిస్తున్నట్లు పైనాపిల్‌ కాదని.. కొబ్బరికాయ అని అధికారులు స్పష్టం చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరికాయను తినటంతో దాని నోరు తీవ్రంగా గాయపడిందని వివరించారు. రోజుల తరబడి ఆహారం, నీరు కూడా తీసుకోలేని స్థితిలో... పాలక్కాడ్‌లోని వెల్లియార్‌ నదిలో ఆ గజరాజు ప్రాణాలు విడిచిందని తెలిపారు. సుమారు 20 రోజుల పాటు ఆహారాన్ని తీసుకొని ఉండదని అధికారులు అంచనా వేశారు.

అరెస్టైన నిందితుడు విల్సన్‌ రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్నాడని.. విచారణలో భాగంగా నిందితుడిని పేలుడు పదార్ధాలు తయారుచేసిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అటవీ అధికారులు చెప్పారు. అక్కడున్న ఓ షెడ్‌లో ఆ వ్యక్తి మరో ఇద్దరితో కలసి పేలుడు పదార్ధాలను తయారు చేశాడని తమ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తప్పక న్యాయం చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కేరళలో అడవి పంది వంటి జంతువులు తమ పంటలను నాశనం చేయకుండా కాపాడుకోవటానికి... స్థానికంగా తయారైన పేలుడు పదార్ధాలను పండ్లు, జంతువుల కొవ్వు వంటి వాటిలో కలిపి వాటికి అక్కడి రైతులు ఎరవేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని