కొవిడ్‌ వార్డులో 35 మంది సామాన్యులు..!

కరోనా వైరస్‌ సోకిందంటూ  ప్రైవేటు ల్యాబ్‌లు ఇచ్చిన ఫలితాల వల్ల... ఆ వ్యాధి లేని వ్యక్తులు మూడురోజుల పాటు ఐసోలేషన్‌ వార్డులో గడపాల్సి వచ్చింది.

Published : 11 Jun 2020 15:20 IST

కరోనా లేకున్నా ఐసోలేషన్‌ పేరుతో మూడు రోజులు!

నొయిడా: కరోనా వైరస్‌ సోకిందంటూ కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ ఇచ్చిన ఫలితాల వల్ల.. ఆ వ్యాధి లేని వారు కూడా పేషెంట్లతోపాటు ఐసోలేషన్‌ వార్డులో గడపాల్సి వచ్చింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... నొయిడా పట్టణంలో ఈ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 35 మంది వ్యక్తులు స్వల్ప జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడటంతో... కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు వారికి సూచించారు.
పరీక్షలు నిర్వహించిన ఆయా ల్యాబ్‌లు వారికి కొవిడ్‌-19 పాజిటివ్‌ ఉందంటూ నివేదికలు ఇచ్చాయి. దీనితో వారిని ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. నిబంధనల ప్రకారం వారి వద్ద నమూనాలు సేకరించి ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’కి పంపించారు. కాగా, సంస్థ వెలువరించిన ఫలితాల్లో వారందరికి నెగిటివ్‌ అని తేలింది. దీనితో మూడురోజులు కొవిడ్‌ వార్డులో ఐసోలేషన్‌లో గడిపిన ఆ వ్యక్తులను ఇళ్లకు పంపించేశారు. అయితే, వారిపై పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన సంబంధిత ల్యాబ్‌లకు నొయిడా అధికార యంత్రాంగం నోటీసులు పంపింది. అంతే కాకుండా వాటిలో ఒకదానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని