ఆర్టీసీలో ఉద్యోగాలు పేరుతో మోసం..

ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి పలువురి నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటనపై పోలీసులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్యాప్తు

Published : 15 Jun 2020 14:16 IST

అమరావతి: ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి పలువురి నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటనపై పోలీసులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో ఇంకా ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని విద్యాధరపురం డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి అదే సంస్థలో సూపర్‌వైజర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు నిరుద్యోగులకు నమ్మబలికాడు. నెలకు రూ.18 నుంచి రూ.25వేల వరకు వేతనం ఉంటుందని చెప్పాడు. అయితే ఒక్కో ఉద్యోగం కోసం రూ.5లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇందులో భాగంగానే ముందుగా ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షలు వసూలు చేశాడు. ఇలా రూ.కోటి వరకు సమకూర్చుకున్నాక 34 మంది పేర్లతో వారికి నకిలీ గుర్తింపు కార్డులు సైతం ఇచ్చాడు. అయినప్పటికీ ఉద్యోగంలో చేరేందుకు కాల్‌లెటర్‌ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు ఉయ్యూరులో ఓ మధ్యవర్తి వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో సదరు ఉద్యోగి బాధితులకు డబ్బు తిరిగి చెల్లిస్తానని నమ్మించాడు. ఎంతకాలమైనా డబ్బు ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రెండు రోజుల క్రితం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోన్‌ కాల్స్‌, వీడియోలు బయటపడ్డాయి. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని