మీకా ఈ-మెయిల్ వచ్చిందా? జాగ్రత్త!  

కొవిడ్‌ -19 పరీక్షలు ఉచితంగా చేస్తాం.. అంటూ మీకేదైనా ఈ మెయిల్‌ వచ్చిందా? అయితే జాగ్రత్తండోయ్‌..! అలాంటి మెయిల్స్‌ను........

Published : 24 Jun 2020 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్టు మీకేదైనా ఈ-మెయిల్‌ వచ్చిందా? అయితే జాగ్రత్తండోయ్‌..! అలాంటి మెయిల్స్‌ను తెరిస్తే సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కినట్టేనని హెచ్చరిస్తున్నారు సైబర్‌ సెక్యూరిటీ రంగ నిపుణులు. ncov2019@gov.in పేరుతో వచ్చిన ఈ-మెయిల్‌ను ఎట్టిపరిస్థితుల్లో తెరవొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి హానికరమైన ఈ- మెయిళ్లను తెరిస్తే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకున్నట్టేనని, మీ వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్ల చేతిలో పెట్టినట్టేనంటోంది  ద ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (Cert-In). ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఓ నోడల్‌ ఏజెన్సీ. 

ఓ వైపు కరోనా వైరస్‌ జనాన్ని వణికిస్తుంటే.. ఇదే అదనుగా భావిస్తున్న సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటికే దేశంలో అనేకమంది వ్యాపారులు, వ్యక్తులు ఈ మోసాలకు గురవుతున్న వేళ అలాంటి ఈ-మెయిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వస్తే వాటిని తక్షణమే డిలీట్‌ చేయాలంటున్నారు సైబర్‌ నిపుణులు. ప్రపంచమంతా కరోనా భయంలో కొట్టుమిట్టాడుతుంటే.. ఈ సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖలు పంపినట్టుగా ఇలాంటి ఫిషింగ్‌ మెయిల్స్‌ను పంపిస్తూ అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. 

క్లిక్‌ చేస్తే.. హుళక్కే..

* ఇలాంటి నకిలీ ఈ- మెయిల్స్‌ మిమ్మల్ని నకిలీ వెబ్‌సైట్ల వైపు తీసుకెళ్తాయి.

* ఈ నకిలీ వెబ్‌సైట్‌లు హానికర ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ కావడంతో పాటు వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడతాయి.

* ఇప్పటివరకు దాదాపు 20లక్షల ఈ మెయిల్‌ ఖాతాలకు ఇలాంటి హానికరమైన మెయిల్స్‌ వెళ్లినట్టు సమాచారం. 

* దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఈ-మెయిల్స్‌ వస్తున్నాయని ఈ నోడల్‌ ఏజెన్సీ తెలిపింది. 

మరేం చేయాలి? 

* కీలకమైన డాక్యుమెంట్లు/ సమాచారాన్ని అత్యంత సురక్షితంగా ఉంచుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీ వైరస్‌ టూల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఈ మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

* అసాధారణ విషయాలకు సంబంధించిన మెయిల్స్‌ వస్తే వెంటనే https://www.cert-in.org.in/ సమాచారం పంపండి.

* అనుచితంగా ఉండే ఇలాంటి సందేశాలను, ఈ మెయిల్స్‌ను తెరవొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. 

* ఒకవేళ ఇలాంటి ఈ మెయిల్స్‌ మీకు తెలిసిన వారి నుంచి వస్తే మాత్రం వాటిని తెరిచే ముందు జాగ్రత్త. వీలైతే పంపిన వారితో మాట్లాడటం మంచిది.

* రివార్డులు, బహుమతులు, కరోనా ఉచిత పరీక్షలు అంటూ వచ్చే ఈ మెయిల్స్‌తో చాలా అప్రమత్తంగా ఉండాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని